Ragi Ambali Old Style : రాగులు.. ఇవి మనందరికి తెలిసినవే. మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో ఇవి ఒకటి. రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, బరువు తగ్గేలా చేయడంలో, ఎముకలను ధృడంగా, బలంగా ఉంచడంలో, రక్తహీనతను తగ్గించడంలో, శరీరానికి బలాన్ని, శక్తిని చేకూర్చడంలో ఇలా అనేక విధాలుగా రాగులు మనకు సహాయపడతాయి. ఈ రాగులతో మనం జావ, సంగటి, రోటి, అంబలి వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. రాగి అంబలి చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది. వేసవి కాలంలో దీనిని తాగడం వల్ల మనం అనేక ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రాగులతో పాత కాలంలో చేసినట్టుగా అంబలిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి అంబలి తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగి పిండి – ఒక కప్పు, నీళ్లు – 4 కప్పులు, చిలికిన పెరుగు – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, చిన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ – 1, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి తరుగు – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత.
రాగి అంబలి తయారీ విధానం..
ముందుగా ఒక మట్టి గిన్నెలో రాగిపిండి, నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత దీనిని స్టవ్ మీద ఉంచి కలుపుతూ ఉడికించాలి. దీనిని 10 నిమిషాల పాటు ఉడికించిన తరువాత మూత పెట్టి మరో 18 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత మరో మట్టి పాత్రలో ఒకటింపావు లీటర్ల నీటిని పోసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన రాగి పిండిని చేత్తో తీసుకుంటూ ఉండలుగా చేసుకుని నీటిలో వేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత ఈ నీటిని రాత్రంతా అలాగే ఉంచాలి. తరువాత ఉదయాన్నే రాగి ఉండలను చేత్తో నలుపుతూ కలపాలి. తరువాత ఈ నీటిని జల్లెడలో పోసి ఉండలు లేకుండా కలుపుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పెరుగు వేసి కలపాలి.
తరువాత ఇందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల రాగి అంబలి తయారవుతుంది. దీనిని ఇలాగే గ్లాస్ లో పోసి సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా రాగి అంబలిని తయారు చేసుకుని తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఎండ వల్ల శరీరం నీరసానికి గురి కాకుండా ఉంటుంది. అలాగే మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వేసవి కాలంలో ఇలా మట్టి పాత్రలో రాగి అంబలిని తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.