Ragi Dalia : రాగుల‌తో ఎంతో రుచిక‌ర‌మైన దాలియాను ఇలా చేయ‌వ‌చ్చు.. అంద‌రూ ఇష్టంగా తింటారు..

Ragi Dalia : మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో రాగులు కూడా ఒక‌టి. రాగుల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రాగుల‌ను పిండిగా చేసి ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రాగుల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో రాగి దాలియా కూడా ఒక‌టి. ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ రాగి దాలియాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి దాలియా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

రాగి పిండి – 3 టేబుల్ స్పూన్స్, ప‌ల్లీలు – 3 టేబుల్ స్పూన్స్, కందిప‌ప్పు – 3 టేబుల్ స్పూన్స్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ధ‌నియాలు – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, నీళ్లు – 300 ఎమ్ ఎల్, 3 గంట‌ల పాటు నాన‌బెట్టిన సామ బియ్యం – 3 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1, త‌రిగిన తోట‌కూర – ఒక క‌ట్ట‌, ఉప్పు – త‌గినంత‌, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌.

Ragi Dalia recipe in telugu very healthy how to make it
Ragi Dalia

రాగి దాలియా త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకోవాలి. త‌రువాత అందులో ఒక క‌ప్పు నీళ్లు పోసి ఉండ‌లు లేకుండా క‌లుపుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో ప‌ల్లీలు వేసి వేయించాలి. ప‌ల్లీలు వేగిన త‌రువాత జార్ లోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో కందిప‌ప్పు వేసి వేయించాలి. కందిప‌ప్పు వేగిన త‌రువాత జీల‌క‌ర్ర‌, ధ‌నియాలు, క‌రివేపాకు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. త‌రువాత వీటిని కూడా జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక తోట‌కూర‌, సామ బియ్యం, ప‌చ్చిమిర్చి వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత క‌లిపి పెట్టుకున్న రాగిపిండి వేసి క‌ల‌పాలి. దీనిని కాస్త ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత ఇందులో మిక్సీ ప‌ట్టుకున్న ప‌ల్లీల పొడి, ఉప్పు వేసి క‌ల‌పాలి.

తరువాత దీనిపై మూత పెట్టి పూర్తిగా మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత నెయ్యి, నిమ్మ‌ర‌సం వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాగి దాలియా త‌యార‌వుతుంది. ఈ రాగి దాలియాను పెరుగులో ఉప్పు, జీల‌క‌ర్ర పొడి, ఉల్లిపాయ త‌రుగు వేసి క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని పిల్ల‌లు కూడా ఇష్టంగా తింటారు. ఈ రాగి దాలియాను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఉద‌యం పూట అల్పాహారంగా ఈ దాలియాను తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

Share
D

Recent Posts