Ragi Upma : రాగి ఉప్మా.. రాగుల రవ్వతో చేసేఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల మనం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. బరువు తగ్గడంలో, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా రాగులు మనకు సహాయపడతాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రాగులతో ఉప్మాను తయారు చేసుకుని తినడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ రాగి ఉప్మాను తయారు చేయడం చాలా సులభం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రాగులతో మరింత రుచిగా ఉప్మాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగి రవ్వ – ఒక గ్లాస్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పల్లీలు – 3 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, శనగపప్పు – ఒక టీస్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 4, తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, కరివేపాకు -ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, వేడి నీళ్లు – 3 గ్లాసులు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
రాగి ఉప్మా తయారీ విధానం..
ముందుగా రవ్వను శుభ్రంగా కడిగి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలు, జీడిపప్పు వేసి వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే నూనెలో ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం తరుగు, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి చక్కగా వేగిన తరువాత రాగి రవ్వను వేసి కలపాలి. దీనిని 3 నిమిషాల పాటు వేయించిన తరువాత నీళ్లు, ఉప్పు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి మధ్యస్థ మంటపై మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి. తరువాత వేయించిన పల్లీలు, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి ఉప్మా తయారవుతుంది. దీనిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా అల్పాహారంగా రాగి రవ్వతో ఉప్మాను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.