Raja Rani Chicken : మనకు రెస్టారెంట్ లలో లభించే చికెన్ వెరైటీలలో రాజా రాణి చికెన్ కూడా ఒకటి. దీనిని చికెన్ 555, చికెన్ ఆర్ ఆర్ అని కూడా పిలుస్తారు. ఈ రాజా రాణి చికెన్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా స్టాటర్స్ గా తింటూ ఉంటారు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ చికెన్ వెరైటీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడి వేడిగా ఈ చికెన్ 555 ను తయారు చేసుకుని తినవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ రాజా రాణి చికెన్ ను రెస్టారెంట్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాజా రాణి చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బటర్ – ఒక టేబుల్ స్పూన్,ఎండుమిర్చి – 1, వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్, అల్లం తరుగు – ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి తరుగు – 2 టేబుల్ స్పూన్స్, టమాట సాస్ – 2 టేబుల్ స్పూన్స్, రెడ్ చిల్లీ సాస్ – 2 టేబుల్ స్పూన్స్, సోయా సాస్ – పావు టేబుల్ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, కాశ్మీరి చిల్లీ కారం – ఒక టీ స్పూన్, తెల్ల మిరియాల పొడి – అర టీ స్పూన్, మీగడ పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, వెనిగర్ – ఒక టీ స్పూన్, నీళ్లు – 2 టీ స్పూన్స్.
చికెన్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
సన్నగా పొడవుగా కట్ చేసిన బోన్ లెస్ – 350 గ్రా., ఉప్పు -తగినంత, తెల్ల మిరియాల పొడి -ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్స్, మైదాపిండి – 3 టేబుల్ స్పూన్స్, వంటసోడా – చిటికెడు, కోడిగుడ్లు – 2, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
రాజా రాణి చికెన్ తయారీ విధానం..
ముందుగా చికెన్ ను ఒక గిన్నెలో తీసుకోవాలి. తరువాత ఇందులో గుడ్లు, నూనె తప్ప ఫ్రైకు కావల్సిన మిగిలిన పదార్థాలు వేసి కలపాలి. తరువాత కోడిగుడ్లల్లో ఉండే తెల్లసొన వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చికెన్ ముక్కలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మరో కళాయిలో బటర్ వేసి వేడి చేయాలి. తరువాత ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి తరుగు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత టమాట, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, సోయా సాస్ లు వేసి కలపాలి.
తరువాత గరం మసాలా, కాశ్మీరి చిల్లీ కారం, తెల్ల మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. తరువాత పెరుగు వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత వెనిగర్, నీళ్లు పోసి కలపాలి. తరువాత వేయించిన చికెన్ వేసి కలపాలి. మసాలా అంతా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాజా రాణి చికెన్ తయారవుతుంది. దీనిని స్నాక్స్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ లకు వెళ్లే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈ చికెన్ వెరైటీని తయారు చేసుకుని తినవచ్చు.