Rava Chocolate Burfi : రవ్వ చాక్లెట్ బర్ఫీ.. రవ్వతో చేసే ఈ బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు, స్పెషల్ డేస్ లో, పండగలకు ఇలా బర్ఫీని తయారు చేసి తీసుకోవచ్చు. అలాగే చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో ఈ బర్ఫీని తయారు చేసుకోవచ్చు. అలాగే ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఈ బర్ఫీని అప్పటికప్పుడు తయారు చేసి పెట్టవచ్చు. ఎంతో రుచిగా, మృదువుగా ఉండే రవ్వ చాక్లెట్ బర్పీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ చాక్లెట్ బర్ఫీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – అర కప్పు, బాదంపప్పు – 6, జీడిపప్పు – 6, యాలకులు – 3, కోకో పౌడర్ – 2 టీ స్పూన్స్, కాచి చల్లార్చిన పాలు – పావు కప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, పాలు – ఒకటింపావు కప్పు, పంచదార – అర కప్పు.
రవ్వ చాక్లెట్ బర్ఫీ తయారీ విధానం..
ముందుగా జార్ లో రవ్వ, బాదంపప్పు, జీడిపప్పు, యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో కోకో పౌడర్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో కాచిచల్లార్చిన పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత గిన్నెలో పాలు పోసి స్టవ్ మీద ఉంచి వేడి చేయాలి. పాలు వేడవుతుండగానే మరో స్టవ్ మీద కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత మిక్సీ పట్టుకున్న రవ్వ వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత మరో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. రవ్వ చక్కగా వేగిన తరువాత మరిగిస్తున్న పాలను పోసి కలపాలి. రవ్వ ఉడికి దగ్గర పడిన తరువాత పంచదార వేసి కలపాలి. దీనిని మరలా దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత ఇందులో ముందుగా సిద్దం చేసుకున్న కోకో మిశ్రమాన్ని వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ట్రే లేదా ప్లేట్ లోకి తీసుకుని పైన సమానంగా చేసుకోవాలి. ఈ రవ్వ మిశ్రమం చల్లారిన తరువాత గిన్నె నుండి అంచులను వేరు చేసి నెమ్మదిగా ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత దీనిని మనకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి. తరువాత వీటిపై బాదంపప్పు పలుకులను ఉంచి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ చాక్లెట్ బర్ఫీ తయారవుతుంది. దీనిని ఒక్క ముక్క కూడా విడిచిపెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలైతే మరింత ఇష్టంగా తింటారు.