Ravva Kesari : బొంబాయి రవ్వతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. స్నాక్స్ తో పాటు తీపి వంటకాలను కూడా చేస్తూ ఉంటాం. రవ్వతో చేఏ తీపి వంటకాల్లో రవ్వ కేసరి కూడా ఒకటి. రవ్వ కేసరి చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. రవ్వ కేసరిని తయారు చేయడం కూడా చాలా తేలిక. దీనిని అప్పుడప్పుడూ వంటింట్లో తయారు చేస్తూ ఉంటారు కూడా. అయితే రవ్వ కేసరి చల్లారే కొద్ది గట్టిగా అవుతూ ఉంటుంది. దీంతో చల్లారిన తరువాత దీనిని తినలేకపోతూ ఉంటాం. అలాంటి ఇబ్బంది ఏమి లేకుండా చల్లారిన తరువాత కూడా పలుచగా, మెత్తగా ఉండేలా రవ్వ కేసరిని మనం తయారు చేసుకోవచ్చు. చల్లారిన తరువాత కూడా గట్టిపడకుండా ఉండేలా రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ కేసరి తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – అర కప్పు, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, ఎండు ద్రాక్ష – 2 టేబుల్ స్పూన్స్, బొంబాయి రవ్వ – అర కప్పు, నీళ్లు – ఒక కప్పు, పంచదార – ఒక కప్పు, ఫుడ్ కలర్ – చిటికెడు, యాలకుల పొడి – పావు టీ స్పూన్.
రవ్వ కేసరి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యిని వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నెయ్యిలో రవ్వ వేసి వేయించాలి. రవ్వ వేయగానే నెయ్యిని పీల్చుకుని గట్టి పడుతుంది. దీనిని ఇలాగే వేయించడం వల్ల క్రమంగా నెయ్యిని వదిలి పలుచగా అవుతుంది. రవ్వ చక్కగా వేగి కొద్దిగా రంగు మారిన తరువాత నీళ్లు పోసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించిన తరువాత రవ్వ దగ్గర పడుతుంది. ఇప్పుడు పంచదారను వేసి కలపాలి. పంచదార కరిగి కొద్ది సమయానికి రవ్వ మరలా పలుచగా తయారవుతుంది. ఇప్పుడు ఫుడ్ కలర్ ను కొద్దిగా నీటిలో కలిపి వేసుకోవాలి.
దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత యాలకుల పొడి, ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. చివరగా మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలపాలి. దీనిని అర నిమిషం పాటు అలాగే ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ కేసరి తయారవుతుంది. ఇది చల్లారిన తరువాత గట్టిగా అవ్వకుండా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా రవ్వ కేసరిని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.