Raw Mango Dal : వేసవి కాలం వచ్చిందంటే చాలు మనకు మార్కెట్లో మామిడి పండ్లు కనిపిస్తాయి. బాగా పండిన మామిడి పండ్లను తినడానికి ఎంతో మంది ఇష్టపడతారు. కానీ పచ్చి మామిడి కాయతో పప్పు చేసి వేడివేడి అన్నంలో తింటే ఆ రుచి వర్ణనాతీతం. మామిడికాయ పప్పును చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తింటారు. మరి అంత రుచికరమైన మామిడికాయ పప్పును ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా.
పచ్చి మామిడికాయ పప్పు తయారీకి కావలసిన పదార్థాలు..
పచ్చి మామిడికాయ – ఒకటి, కందిపప్పు – ఒక కప్పు, టమోటాలు – మూడు, పచ్చిమిర్చి – 15, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, కొత్తిమీర – తగినంత, నీరు – తగినంత.
పోపుకు కావలసిన పదార్థాలు..
ఆవాలు – అర టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, ధనియాలు – అర టీస్పూన్, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 4, పచ్చి కరివేపాకు – 1 రెమ్మ, ఎండు మిర్చి – 2, నూనె – 3 టేబుల్ స్పూన్లు.
పచ్చి మామిడి కాయ పప్పు తయారీ విధానం..
ముందుగా పచ్చి మామిడికాయ తొక్క మొత్తం తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. కంది పప్పు, పర్చిమిర్చి, టమాటాలు, మామిడి ముక్కలు, కొత్తిమీర, పసుపు, తగినంత నీరు కుక్కర్ లో వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ వెళ్లిన తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసి పప్పును బాగా మెదపాలి. స్టవ్ పై మరో కడాయిను ఉంచి కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడి అయిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసి బాగా మగ్గనివ్వాలి. ఆవాలు చిటపట అనగానే పోపును ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పులో వేయాలి. దీంతో ఎంతో రుచికరమైన పచ్చి మామిడి కాయ పప్పు రెడీ అవుతుంది. ఈ పప్పును వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.