వైసీపీ ఓటమి తర్వాత కాస్త సైలెంట్ అయిన రోజా ఇప్పుడు మళ్లీ తనదైన స్టైల్‌లో పంచ్‌లు విసురుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్‌లని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తుంది. చంద్రబాబు నాయుడు పెద్ద స్వార్థపరుడు అన్న రోజా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎందరినో బలితీసుకొన్న చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. ఇప్పుడు తిరుమల లడ్డుని కూడా తన స్వార్థ ప్రయోజనాల కోసం బజారుకీడ్చి అపవిత్రం చేస్తున్నాడని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాలకోసం సొంతమామ ఎన్టీఆర్ నే బలి తీసుకొన్నాడని, తర్వాత తోడల్లుడు దగ్గుబాటిని, బామ్మరిది హరికృష్ణ, అతని కొడుకు జూనియర్ ఎన్టియార్ లను కూడా బలి తీసుకొన్న చరిత్ర చంద్రబాబుదన్నారు.
చంద్రబాబు ఈవీఎంలను మేనేజ్ చేసి ఎన్నికల్లో విజయం సాధించారంటూ సంచలన ఆరోపించారు రోజా. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. విజయవాడలో వరదలతో ప్రజలు ఇబ్బంది పడుంటే.. కనీసం వాళ్లకు తాగేందుకు నీళ్లు, పిల్లలకు పాలు కూడా ఇవ్వలేకపోయారన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేస్తుంటే కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. ఈ తప్పుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. అందుకే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు కల్తీ నెయ్యి వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు.
తిరుమల లడ్డూ వివాదంపై తాము సీబీఐ విచారణ కోరుతున్నామని.. గతంలో కుల రాజకీయాలు చేసిన చంద్రబాబు ఇప్పుడు మత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఏ విచారణకైనా సిద్ధమని, సీబీఐ, సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిగినా తమకు అభ్యంతరం లేదన్నారు. ఒకవేళ తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించి ఉంటే విచారణ చేయాలని.. ఇలా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం సరికాదన్నారు రోజా. చంద్రబాబు తాను చెప్పిన అబద్దాన్ని నిజం చేసేందుకు ఒక తప్పుడు రిపోర్ట్ తీసుకొచ్చారన్నారు.