Rose Plants : ప్రస్తుత తరుణంలో చాలా మంది ఇంటి ఆవరణలో పూల మొక్కలు, అలంకరణ మొక్కలు, కూరగాయలను పెంచేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. కాస్తంత ఖాళీ స్థలం ఉన్నా చాలు.. కుండీల్లో అయినా సరే వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. ఇక చాలా మంది పెంచే మొక్కల్లో గులాబీలు ఒకటి. ఇవి అనేక రకాల రంగుల్లో మనకు అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల గులాబీ పువ్వులను ఒక్క చోట చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. అందుకనే రకరకాల గులాబీ మొక్కలను చాలా మంది కుండీల్లో పెంచుతుంటారు.
ఇక గులాబీ మొక్కలను సంరక్షించడం పెద్ద సవాలే. ఎందుకంటే వాటికి నీళ్లు సరిగ్గా పోయాలి. లేదంటే ఎండిపోతాయి. వాటిని జాగ్రత్తగా సంరక్షించుకుంటేనే అవి బతుకుతాయి. ఇక గులాబీ పువ్వులు పూయడం లేదని చాలా మంది వాపోతుంటారు. అందుకు ఏం చేయాలో కూడా వారికి తెలియదు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఓ చిట్కాను పాటిస్తే చాలు.. గులాబీ పువ్వులు మొక్కలకు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. అవును.. అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
బియ్యం కడిగిన నీళ్లను సేకరించి ఒక రోజంతా అలాగే నిల్వ బెట్టాలి. దీంతో నీళ్లు పులుస్తాయి. ఇప్పుడు ఆ నీళ్లలో బాగా మగ్గిన అరటి పండ్లను తొక్కతో సహా మెదుపుతూ వేయాలి. మొత్తం నీళ్లు, పండ్లను బాగా కలపాలి. మెత్తని గుజ్జులా తయారు చేయాలి. ఇలా చేసిన తరువాత మూతపెట్టి మరో 2 రోజుల పాటు ఉండాలి. దీంతో మంచి సేంద్రీయ ఎరువులా తయారవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గులాబీ మొక్కలకు కొద్ది కొద్దిగా చల్లాలి. ఇలా చేస్తుంటే గులాబీ మొక్కలకు పువ్వులు గుత్తులుగా పూస్తాయి. ఇక ఈ ఎరువును ఇతర పూల మొక్కలకు కూడా వాడుకోవచ్చు. కానీ కాస్తంత మాత్రమే వేయాల్సి ఉంటుంది. అప్పుడే అనుకున్న ఫలితాలు వస్తాయి.