Sabudana Steamed Papad : వేసవి కాలం వచ్చిందంటే చాలు మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి వడియాలు. వీటిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని సంవత్సరమంతా నిల్వ చేసుకుంటూ ఉంటాం. పప్పు, రసం, సాంబార్ వంటి వాటితో ఈ వడియాలను తింటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే మనం రకరకాల వడియాలను తయారు చేస్తూ ఉంటాం. వాటిలో సగ్గుబియ్యం వడియాలు కూడా ఒకటి. సగ్గు బియ్యం వడియాలు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. సగ్గుబియ్యంతో వడియాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సగ్గు బియ్యం వడియాలు తయారీకి కావల్సిన పదార్థాలు..
6 గంటల పాటు నానబెట్టిన సగ్గు బియ్యం – ఒక కప్పు, అల్లం – ఒక ఇంచు ముక్క, పచ్చిమిర్చి – 5, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత,నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
సగ్గు బియ్యం వడియాల తయారీ విధానం..
ముందుగా సగ్గుబియ్యాన్ని వడకట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత జార్ లో పచ్చిమిర్చి, అల్లం వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని సగ్గుబియ్యంలో వేసి కలపాలి. ఇందులోనే జీలకర్ర, ఉప్పు కూడా వేసి కలపాలి. తరువాత ఇడ్లీ ప్లేట్ లను తీసుకుని వాటికి నూనె రాయాలి. తరువాత ఈ ప్లేట్ లలో సగ్గుబియ్యం మిశ్రమాన్ని పలుచగా అప్పడంలా వేసుకోవాలి. తరువాత ఇడ్లీ కుక్కర్ లో ఒక గ్లాస్ నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ముందుగా సిద్దం చేసుకున్న ప్లేట్ లను కుక్కర్ లో ఉంచి ఆవిరిపై ఉడికించాలి. వీటిని 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
వడియాలు చల్లారిన తరువాత వాటిని నెమ్మదిగా తీసి మరో ప్లేట్ లోకి వేసుకోవాలి. ఈ వడియాలను ఒకటి లేదా రెండు రోజుల పాటు ఎండలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల సగ్గుబియ్యం వడియాలు తయారవుతాయి. ఇలా తయారు చేసుకున్న వడియాలను నూనెలో వేసి వేయించుకోవాలి. కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వడియాలను వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సగ్గు బియ్యం వడియాలు తయారవుతాయి. వీటిని పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తినవచ్చు. ఈ వడియాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.