Sajja Burelu : సజ్జలు.. మనం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాలల్లో సజ్జలు కూడా ఒకటి. సజ్జలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఎముకలను ధృడంగా ఉంచడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, జ్ఞాపక శక్తిని పెంచడంలో, రకతహీనతను తగ్గించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇలా అనేక రకాలుగా సజ్జలు మనకు సహాయపడతాయి. సజ్జలతో మనం చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో సజ్జ బూరెలు కూడా ఒకటి. సజ్జ బూరెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ సజ్జ బూరెలను చక్కగా పొంగేలా, రుచిగా, మెత్తగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సజ్జ బూరెల తయారీకి కావల్సిన పదార్థాలు..
సజ్జలు – కిలో, బెల్లం – అరకిలో, ఎండు కొబ్బరి – 50 గ్రా., యాలకులు -15, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, ఉప్పు – అర టీ స్పూన్.
సజ్జ బూరెల తయారీ విధానం..
ముందుగా సజ్జలను శుభ్రం చేసుకోవాలి. తరువాత నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తరువాత తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. సజ్జలను నానబెట్టిన తరువాత వాటిని వస్త్రంపై వేసి ఫ్యాన్ గాలికి పూర్తిగా తడి లేకుండా ఆరబెట్టాలి. ఇలా ఆరబెట్టిన తరువాత వీటిని పిండిగా చేసుకోవాలి. ఈ సజ్జలను జార్ లో వేసి మిక్సీ పట్టుకోవచ్చు లేదా గిర్రిలో వేసి పిండి చేసుకోవచ్చు. ఇప్పుడు సజ్జ పిండిని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఒక జార్ లో యాలకులు, ఎండు కొబ్బరి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని సజ్జ పిండిలో వేసి బాగా కలపాలి. ఇందులోనే ఉప్పు వేసి అంతా కలిసేలా కలుపుకున్న తరువాత కళాయిలో బెల్లం తురమును తీసుకోవాలి. తరువాత అది మునిగే వరకు నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం పూర్తిగా కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని వడకట్టాలి. ఇప్పుడు ఈ బెల్లం నీటిని సజ్జ పిండిలో వేసి కలపాలి.
ముందుగా గంటెతో అంతా కలిసేలా కలుపుకున్న తరువాత చేత్తో నొక్కుతూ బాగా కలుపుకోవాలి. ఒకవేళ నీరు తక్కువైతే కాచి చల్లార్చిన నీటిని పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలాపిండిని చక్కగా ముద్దగా కలుపుకున్న తరువాత మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడవుతుండగానే నీటిలో తడిపిన వస్త్రాన్ని లేదా ప్లాస్టిక్ కవర్ ను లేదా బటర్ పేపర్ ను తీసుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా సజ్జ పిండిని తీసుకుంటూ చేతికి తడి చేసుకుంటూ బూరెల వలె వత్తుకోవాలి. ఈ బూరెలు మరీ పలుచగా మరీ మందంగా ఉండకుండా చూసుకోవాలి. నూనె వేడయ్యాక ఈ బూరెలను నూనెలో వేసి వేయించాలి. ఈ బూరెలను మధ్యస్థ మంటపై రెండు ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సజ్జ బూరెలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ విధంగా మొదటిసారి చేసే వారు కూడా సజ్జలతో రుచికరమైన బూరెలను తయారు చేసుకుని తినవచ్చు.