Thotakura Sweet Corn Vada : మనం స్నాక్స్ గా వడలను కూడా తయారు చేస్తూ ఉంటాము. బయట బండ్ల మీద ఇవి ఎక్కువగా దొరుకుతాయి. అలాగే ఈ వడలను మనం ఇంట్లో కూడా సులభంగా తయారు చేస్తూ ఉంటాము. అలాగే వీటిని మనం వివిధ రుచుల్లో తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన మసాలా వడలల్లో తోటకూర స్వీట్ కార్న్ వడలు కూడా ఒకటి. ఈ వడలు బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని మనం పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఆకుకూరలు తినని పిల్లలకు వాటితో ఇలా వడలను తయారు చేసి పెట్టవచ్చు. ఎంతో రుచిగా క్రిస్పీగా ఉండే తోటకూర స్వీట్ కార్న్ వడలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తోటకూర స్వీట్ కార్న్ వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన తోటకూర – చిన్నది ఒకటి, స్వీట్ కార్న్ – ఒక కప్పు, పచ్చిమిర్చి – 2, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ఉప్పు -తగినంత, పసుపు – పావు టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా పొడి లేదా చికెన్ మసాలా – అర టీ స్పూన్, శనగపిండి – 2 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి – రెండున్నర టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
తోటకూర స్వీట్ కార్న్ వడ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో స్వీట్ కార్న్ గింజలను, పచ్చిమిర్చిని తీసుకుని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మరో రెండు టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్ గింజలను వేసి కలపాలి. తరువాత తోటకూరను వేసి కలపాలి. ఇప్పుడు నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటిని ఒక్కొక్కటిగా వేసి బాగా కలపాలి. పిండి పలుచగా ఉంటే కొద్దిగా శనగపిండి వేసి కలుపుకోవచ్చు. పిండిని చక్కగా కలుపుకున్న తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె మధ్యస్థంగా వేడయ్యాక ఒక్కో ఉండను తీసుకుంటూ వడలాగా వత్తుకుని నూనెలో వేసుకోవాలి. ఈ వడలను మధ్యస్థ మంటపై రెండు వైపులా చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే తోటకూర స్వీట్ కార్న్ వడలు తయారవుతాయి. వీటిని చట్నీతో లేదా టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడి వేడిగా రుచిగా వడలను చేసుకుని తింటూ వర్షాన్ని ఎంజాయ్ చేయవచ్చు.