Semiya Fruit Custard : మనం సేమియాతో రకరకాల తీపి వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. సేమియాతో చేసే తీపి వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. సేమియాతో చేసుకోదగిన తీపి వంటకాల్లో సేమియా ఫ్రూట్ కస్టర్డ్ కూడా ఒకటి. సేమియాతో చేసే ఈ కస్టర్డ్ చల్ల చల్లగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. వేసవికాలంలో తినడానికి ఈ స్వీట్ చాలా చకక్కగా ఉంటుంది. ఎంతో రుచిగా చల్ల చల్లగా సేమియా కస్టర్డ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సేమియా ఫ్రూట్ కస్టర్డ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – అర టీ స్పూన్, సేమియా – పావు కప్పు, నీళ్లు – అర కప్పు, పాలు – అర లీటర్, పంచదార – పావు కప్పు, కస్టర్డ్ పౌడర్ – ఒక టేబుల్ స్పూన్.
సేమియా ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో అర కప్పు పాలను తీసుకుని అందులో కస్టర్డ్ పౌడర్ ను వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక సేమియా వేసి చిన్న మంటపై వేయించాలి. తరువాత నీళ్లు పోసి సేమియాను ఉడికించాలి. సేమియా చక్కగా ఉడికిన తరువాత పాలు పోసి కలపాలి. పాలు ఉడుకుపట్టిన తరువాత పంచదార వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత కస్టర్డ్ పౌడర్ వేసిన పాలు పోసి కలపాలి. వీటిని కలుపుతూ 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. వీటిని పైన మీగడ పేరుకుపోకుండా కలుపుతూ చల్లార్చుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సేమియా కస్టర్డ్ తయారవుతుంది. దీనిని ఇలాగే తినవచ్చు లేదా ఫ్రిజ్ లో ఉంచి చల్లగా అయిన తరువాత కూడా తినవచ్చు.
ఈ సేమియా కస్టర్డ్ ను మరింత ఆకర్షణీయంగా, మరింత రుచిగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ముందుగా ఈ గ్లాస్ లో నానబెట్టిన సబ్జా గింజలను తీసుకోవాలి. ఇందులో రోస్ సిరప్ ను వేసి కలపాలి. తరువాత దీనిపై కొద్దిగా సేమియా కస్టర్డ్ ను తీసుకోవాలి. తరువాత దీనిపై మనకు నచ్చిన ఫ్రూట్స్ ను, డ్రై ఫ్రూట్ ముక్కలను వేసుకోవచ్చు. తరువాత మరి కొద్దిగా కస్టర్డ్ ను వేసుకుని ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేసిన సేమియా కస్టర్డ్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వేసవికాలంలో ఇలా చల్ల చల్లగా సేమియా కస్టర్డ్ ను తయారు చేసుకోవచ్చు.