Sesame Burfi : నువ్వులు.. ఇవి మనందరికి తెలిసినవే. నువ్వులను మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. నువ్వులను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. నువ్వులను ఉపయోగించడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో నొప్పులు తగ్గుతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. నువ్వులను పొడిగా చేసి వంటల్లో వాడడంతో పాటు నువ్వులను తీపి వంటకాల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే నువ్వులతో మనం ఎంతో రుచిగా ఉండే బర్ఫీని కూడా తయారు చేసుకోవచ్చు. నువ్వుల బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎంతో రుచిగా ఉండడంతో పాటు మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ నువ్వుల బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వుల బర్ఫీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నువ్వులు – ఒక కప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, మిల్క్ పౌడర్ – పావు కప్పు, పంచదార – ఒక కప్పు, నీళ్లు – ఒక కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్.
నువ్వుల బర్ఫీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నువ్వులను వేసి వేయించాలి. నువ్వులు చక్కగా వేగిన తరువాత వీటిని జార్ లో వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక నువ్వుల పొడిని వేసి కలపాలి. నువ్వుల పొడి చక్కగా వేగిన తరువాత మిల్క్ పౌడర్ వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసి దీనిని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగి తీగపాకం వచ్చే వరకు దీనిని ఉడికించాలి. తరువాత ఈ పంచదార పాకాన్ని నువ్వుల పొడిలో కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత ఈ నువ్వుల మిశ్రమాన్ని స్టవ్ మీద ఉంచి చిన్న మంటపై కలుపుతూ వేడి చేయాలి. నువ్వుల మిశ్రమం దగ్గర పడి కళాయికి అంటుకోకుండా వేరయ్యే వరకు వేడి చేయాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని పైన అంతా సమానంగా చేసుకోవాలి. తరువాత దీనిని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. నువ్వుల మిశ్రమం గోరు వెచ్చగా అయిన తరువాత కావల్సిన ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి. తరువాత దీనిని చల్లారే వరకు ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నువ్వుల బర్ఫీ తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు ఇలా నువ్వులతో రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా నువ్వుల బర్ఫీని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.