Sesame Seeds Rice : లంచ్‌లోకి అప్ప‌టిక‌ప్పుడు ఇలా నువ్వుల అన్నం చేయండి.. భ‌లే రుచిగా ఉంటుంది..

Sesame Seeds Rice : మ‌నం ఆహారంగా తీసుకునే నూనె గింజ‌ల్లో నువ్వులు కూడా ఒక‌టి. వీటిలో ఎన్నో ఔష‌ధ గుణాలు, పోష‌కాలు దాగి ఉన్నాయి. నువ్వుల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. నువ్వుల‌ను పొడిగా చేసి వంట‌ల్లో వాడుతూ ఉంటాం. అలాగే నువ్వుల‌తో చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా నువ్వుల‌తో నువ్వుల అన్నాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. నువ్వుల అన్నం చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు కూడా దీనిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా నువ్వుల అన్నాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నువ్వుల అన్నం తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం – ఒక గ్లాస్, ఉప్పు – త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ ఎండుమిర్చి – 1, జీడిప‌ప్పు ప‌లుకులు – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ఇంగువ – కొద్దిగా, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Sesame Seeds Rice very healthy you can cook it very easily
Sesame Seeds Rice

మ‌సాలా పొడి త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, శ‌న‌గ‌ప‌ప్పు – 2 టీ స్పూన్స్, మిన‌ప‌ప్పు – 2 టీ స్పూన్స్, ఎండుమిర్చి – 4 లేదా 5, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, నువ్వులు – 4 టేబుల్ స్పూన్స్.

నువ్వుల అన్నం తయారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో బియ్యాన్ని వేసి శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు, ఉప్పు వేసి మూత పెట్టి 2 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి. త‌రువాత మూత తీసి అన్నాన్ని పొడి పొడిగా చేసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో పల్లీల‌ను వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత మ‌సాలా పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి. ఇవి అన్నీ కూడా చ‌ల్ల‌గా అయిన త‌రువాత జార్ లో వేయాలి. ఇందులో త‌గినంత ఉప్పు వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు ప‌దార్థాల‌ను వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత జీడిప‌ప్పు ప‌లుకులు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ఇంగువ వేసి క‌ల‌పాలి.

ఇప్పుడు మంటను చిన్న‌గా చేసి పొడి పొడిగా చేసుకున్న అన్నాన్ని వేసి క‌ల‌పాలి. త‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న మ‌సాలా పొడిని వేసి అంతా కలిసేలా బాగా క‌ల‌పాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే నువ్వుల అన్నం త‌యార‌వుతుంది. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు, స‌మయం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా నువ్వుల అన్నాన్ని చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని తిన‌డం వ‌ల్ల నువ్వుల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను కూడా మ‌నం పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts