Shane Warne : ప్రముఖ ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్, లెజెండరీ బౌలర్ షేన్ వార్న్ (52) శుక్రవారం గుండె పోటుతో కన్నుమూసిన విషయం విదితమే. వార్న్ హఠాన్మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. యావత్ క్రికెట్ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. ఎంతో మంది యువ బౌలర్లకు వార్న్ స్నిన్ పాఠాలు నేర్పించారు. ఎంతో మందికి ప్రేరణగా నిలిచారు.
ఇక వార్న్ పిచ్ మీద బంతిని ఎంతలా గింగిరాలు తిప్పుతాడంటే.. ఆ విషయాన్ని వర్ణించేందుకు నిజంగా మాటలు చాలవు. అదొక అద్భుతం. లెగ్ స్పిన్నర్‌గా ఎంతో పేరుగాంచిన వార్న్ ఆస్ట్రేలియాకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించాడు. ఇక 1993లో ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో జరిగిన యాషెస్ సిరీస్ తొలి టెస్టులో రెండో రోజు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో ఆ జట్టు బ్యాట్స్‌మన్ మైక్ గ్యాటింగ్‌ను వార్న్ చిత్రాతి చిత్రంగా ఔట్ చేశాడు.
మైక్ గ్యాటింగ్ వికెట్లను కాపాడుకుంటూ జాగ్రత్తగా డిఫెన్స్ పెట్టాడు. కానీ వార్న్ వేసిన బంతి లెగ్ వికెట్ లైన్‌లో పడి గింగిరాలు తిరుగుతూ ఆఫ్ సైడ్‌కు వచ్చి వికెట్లను గిరాటేసింది. దీంతో వార్న్ ఆ బంతిని తిప్పిన విధానంపై అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఇక వార్న్ అప్పట్లో వేసిన ఆ బంతిని బాల్ ఆఫ్ ది సెంచరీగా పరిగణిస్తుంటారు. వార్న్ ఒక బంతిని అలా ఎలా తిప్పాడో ఇప్పటికీ క్రికెట్ ప్రేమికులు వీడియోల్లో చూస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన మరణంతో అప్పట్లో ఆయన తీసిన ఈ వికెట్ తాలూకు వీడియో వైరల్‌గా మారింది.