ప్రతి మనిషికి నిద్ర చాలా అవసరం. కానీ ప్రస్తుత తరుణంలో చాలా మంది నిద్రకి తగినంత సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. రోజంతా పని చేసి వచ్చి టీవీ చూస్తూ లేదా ఫోన్ చూస్తూ ఎప్పటికో నిద్రపోతున్నారు. అయితే మనం పడుకునే స్థితిని బట్టి మన శరీరానికి లభించే విశ్రాంతిలో తేడాలుంటాయట. మన పెద్దలు ఏది చెప్పినా దాని వెనుక ఎంతో అర్థం దాగి ఉంటుంది. ఉత్తరం వైపు తల పెట్టుకుని నిద్రపోకూడదని అలా నిద్రిస్తే మృత్యువు వెంటాడుతుందని మనకు తరచూ పెద్దలు చెబుతూనే ఉంటారు. కానీ చాలా మంది వారి మాటలను తేలికగా తీసుకుని ఏ దిశలో పడితే ఆ దిశలో నిద్రిస్తూ ఉంటారు.
భూమిపై అయస్కాంత క్షేత్రాలు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. ఈ అయస్కాంత క్షేత్రం ప్రభావం భూమిపై అన్ని దిక్కుల కంటే ఉత్తరం వైపు ఎక్కువగా ఉంటుంది. భూ అయస్కాంత శక్తి ఉత్తరం నుండి దక్షిణం వైపుకు ప్రసరిస్తుంది. దీని వల్ల ఉత్తరం వైపు తల పెట్టుకుని పడుకోవడం వల్ల అయస్కాంత శక్తి దక్షిణం వైపు లాగడం వల్ల ఉత్తరం వైపు ఉన్న మన మెదడుకు రక్త ప్రసరణ సాఫీగా సాగదు. దీని ప్రభావం మన మెదడులోని కణాలపై పడుతుంది. దీంతో సరిగ్గా నిద్రపట్టకపోవడం, చికాకు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తుతాయి.
ముఖ్యంగా ఈ ప్రభావం పెద్దవారిలో అధికంగా కనబడుతుంది. వారిలో మెదడు కణాలు దెబ్బతిని పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మనం ఉత్తరం వైపుకు తప్ప ఏ ఇతర దిక్కులోనైనా పడుకోవచ్చు. ఒక్కో దిక్కులో పడుకుంటే ఒక్కో ఫలితం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అధిక ఒత్తిడితో బాధపడుతున్నవారు దక్షిణం వైపు తల పెట్టుకుని నిద్రించడం వల్ల వారు త్వరగా ఒత్తిడి నుండి బయటపడతారట. దక్షిణ దిక్కున తల పెట్టి నిద్రించడం వల్ల అయస్కాంత శక్తి కారణంగా మన శరీరానికి విశ్రాంతి లభించి త్వరగా నిద్రలోకి జారుకుంటామని నిపుణులు తెలియజేస్తున్నారు.
అయితే దక్షిణం యమస్థానం కనుక ఈ దిక్కున నిద్రించడానికి చాలా మంది ఇష్టపడరు. తూర్పు దిశలో పడుకోవడం వల్ల మెదడు పనితీరు పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ఈ దిశలో పడుకోవడం వల్ల విద్యార్థులకు మంచి జరుగుతుంది. పడమర దిక్కులో మనం నిద్రించవచ్చు. నిద్రలేవగానే మన అర చేతులను చూసుకుని మన కుడి వైపుకు దిగాలి. ఈ నియమాలను పాటిస్తూ నిద్రించడం వల్ల మనం చక్కని నిద్రను పొందవచ్చు. అలాగే మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.