Soft Mutton Fry : మ‌ట‌న్‌ను మెత్త‌గా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఇలా ఫ్రై చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Soft Mutton Fry : మ‌ట‌న్‌తో చాలా మంది ర‌క‌ర‌కాల వంట‌ల‌ను చేస్తుంటారు. ఆదివారం వ‌చ్చిందంటే చాలా మంది మ‌ట‌న్ తినేందుకు అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటారు. మ‌ట‌న్‌తో కూర‌, బిర్యానీ, పులావ్ వంటివి చేసుకోవ‌చ్చు. అయితే మ‌ట‌న్‌ను ఫ్రై చేసుకుని తినేందుకు చాలా మంది ఇష్ట ప‌డ‌రు. ఎందుకంటే మ‌ట‌న్ ఫ్రై మెత్త‌గా రాద‌ని అనుకుంటుంటారు. క‌నుక మ‌ట‌న్‌ను ఫ్రై చేయ‌రు. కూర‌గానే ఇష్ట‌ప‌డ‌తారు. అయితే కింద చెప్పిన విధంగా చేస్తే మ‌ట‌న్ ఫ్రై ని ఎంతో మెత్త‌గా నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేలా చేసుకోవ‌చ్చు. ఇలా ఒక్క‌సారి ట్రై చేస్తే మ‌ళ్లీ మ‌ట‌న్ తెచ్చుకున్న‌ప్పుడు కేవ‌లం ఫ్రై మాత్ర‌మే కావాల‌ని అడుగుతారు. ఇక మ‌ట‌న్ ఫ్రై ని మెత్త‌గా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ట‌న్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మ‌ట‌న్ – అర కిలో (చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్‌, పెరుగు – 2 టేబుల్ స్పూన్లు, కారం – 1 టీస్పూన్‌, ప‌సుపు – అర టీస్పూన్‌, జీల‌క‌ర్ర పొడి – 1 టీస్పూన్‌, ధ‌నియాల పొడి – 1 టీస్పూన్‌, గ‌రం మ‌సాలా – అర టీస్పూన్‌, ఉప్పు – రుచికి స‌రిప‌డా, నూనె – 2 టేబుల్ స్పూన్లు, స‌న్న‌గా త‌రిగిన కొత్తిమీర – 1 టేబుల్ స్పూన్‌.

Soft Mutton Fry recipe in telugu very tasty easy method
Soft Mutton Fry

మ‌ట‌న్ ఫ్రై ని త‌యారు చేసే విధానం..

ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో మ‌ట‌న్ ముక్క‌లు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పెరుగు, కారం, ప‌సుపు, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, ఉప్పు వేసి బాగా క‌ల‌పాలి. మట‌న్ ముక్క‌ల‌కు మ‌సాలా అంతా క‌లిసేలా బాగా కలిపి ముక్క‌ల‌ను మ్యారినేట్ చేయాలి. దీన్ని ఒక గంట పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. దీంతో మ‌ట‌న్ చ‌క్క‌గా మ్యారినేట్ అవుతుంది. చ‌క్క‌ని టేస్ట్ వ‌స్తుంది. ఒక కుక్క‌ర్‌ తీసుకుని స్ట‌వ్‌పై పెట్టి మీడియం మంట‌పై ఉంచాలి. అందులో నూనె పోసి కాగ‌బెట్టాలి. నూనె కాగిన త‌రువాత మ్యారినేట్ చేయ‌బ‌డిన ముక్క‌ల‌ను వేయాలి.

అనంత‌రం అందులో స‌రిప‌డా నీళ్ల‌ను పోయాలి. త‌రువాత మూత పెట్టి ఉడికించాలి. మ‌ట‌న్ మెత్త‌గా ఉడికేందుకు ఎన్ని విజిల్స్ అవ‌స‌రం అవుతాయో అన్ని విజిల్స్ పాటు ఉడికించాలి. త‌రువాత కుక్క‌ర్ మూత తీసి మ‌ట‌న్‌ను వేరు చేయాలి. అనంత‌రం ఒక పాన్ తీసుకుని అందులో నూనె వేసి కాగ‌బెట్టాలి. నూనె కాగాక అందులో ముందుగా ఉడికిన మ‌ట‌న్ ముక్క‌ల‌ను వేసి వేయించాలి. మ‌ట‌న్ ఆల్రెడీ ఉడికింది కాబ‌ట్టి.. కాసేపు వేయిస్తే స‌రిపోతుంది. అందులో అవ‌స‌రం అనుకుంటే కాస్త ఉప్పు, కారం, ప‌సుపు, మ‌సాలా వేసుకోవ‌చ్చు.

దీంతో రుచి వ‌స్తుంది. ముక్క‌ల‌కు అన్నీ బాగా ప‌ట్టాయి అనుకున్నాక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేయాలి. అనంత‌రం మ‌ట‌న్ ఫ్రై ని కొత్తిమీర ఆకుల‌తో గార్నిష్ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉంటే మెత్త‌ని మ‌ట‌న్ ఫ్రై రెడీ అవుతుంది. దీన్ని అన్నంలో క‌లిపి తిన‌వ‌చ్చు. లేదా అంచుకు పెట్టుకుని తిన‌వ‌చ్చు. అయితే మ‌ట‌న్‌ను ఉడికించిన నీళ్ల‌ను పార‌బోయ‌కుండా దాంతో సూప్ చేసుకుని తాగ‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అది బ‌లాన్ని ఇస్తుంది. కాబ‌ట్టి మ‌ట‌న్‌తో ఈసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు.

Share
Editor

Recent Posts