Employees : కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నూతన పనివిధానం, సెలవులు, వేతన సవరణలను అమలు చేయనుంది. ఈ క్రమంలోనే ఇకపై వారంలో ఉద్యోగులు 4 రోజులు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. 3 రోజులు సెలవులు ఉంటాయి. అవి వీక్లీ ఆఫ్‌ల రూపంలో లభిస్తాయి.
నూతన పనివిధానం, వేతన సవరణలకు సంబంధించిన డ్రాఫ్ట్ రూల్స్‌ను కేంద్రం ఫిబ్రవరి 2021లోనే రూపొందించింది. అందుకు అనుగుణంగా పలు రాష్ట్రాలు కూడా ఇప్పటికే డ్రాఫ్ట్ రూల్స్‌ను మార్చుకుంటున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, పంజాబ్, మణిపూర్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లు ఉన్నాయి.
కాగా కొత్త చట్టాన్ని వచ్చే ఏడాది (2022) ప్రారంభం నుంచే అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు ఇకపై వారంలో ఎక్కువ రోజులు సెలవులు లభిస్తాయి. అయితే వేతన సవరణను కూడా అమలు చేయనున్నారు కనుక.. ఉద్యోగులకు అందే మొత్తం తగ్గుతుందని కూడా భావిస్తున్నారు.
నూతన వేతన సవరణ ప్రకారం ఉద్యోగులు ఇకపై నెల నెలా ఎక్కువ మొత్తంలో గ్రాట్యుటీ, పీఎఫ్‌లకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వారికి నెల నెలా అందే వేతనం కొంత మేర తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే మొత్తం వేతనంలో బేసిక్ పే 50 శాతం లేదా అంతకన్నా ఎక్కువగా ఉండాలి. అలవెన్స్‌లు మాత్రం మొత్తం వేతనంలో 50 శాతానికి మించకూడదు. ఈ విధంగా వేతన సవరణలు చేయనున్నారు.