Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయాలి. వేళకు నిద్రించాలి. తగిన పౌష్టికాహారం తీసుకోవాలి. వేళకు భోజనం చేయాలి. దీంతోపాటు రోజూ తగినంత నీటిని కూడా తాగాలి. ఇక నిద్ర విషయానికి వస్తే.. రోజూ కచ్చితంగా తగినన్ని గంటల పాటు నిద్రించాలి. నిద్రించడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.
రోజూ తగినన్ని గంటలపాటు నిద్రించడం వల్ల శరీర మెటబాలిజం మెరుగుపడుతుంది. క్యాలరీలు సరిగ్గా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది. దీంతోపాటు శరీరం తనకు తాను మరమ్మత్తులు చేసుకుంటుంది. వ్యాధుల నుంచి బయట పడతారు. కండరాల నిర్మాణం జరుగుతుంది. ఇలా రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
అయితే చాలా మంది రోజుకు అసలు ఎన్ని గంటలు నిద్రించాలి ? అని సందేహిస్తుంటారు. అయితే ఇందుకు నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారంటే.. ఎవరైనా సరే.. తమ వయస్సుకు తగినట్లుగా రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించాల్సి ఉంటుందని అంటున్నారు. మరి ఏ వయస్సు వారు రోజుకు ఎన్ని గంటల పాటు నిద్రించాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
* అప్పుడే జన్మించిన శిశువుల నుంచి 3 నెలల వయస్సు ఉన్న పసికందులకు రోజుకు 14 నుంచి 17 గంటల పాటు నిద్ర అవసరం ఉంటుంది.
* 4 నెలల నుంచి 11 నెలల వయస్సు ఉన్న చిన్నారులకు రోజుకు 12 నుంచి 15 గంటల నిద్ర అవసరం.
* 1 ఏడాది నుంచి 2 సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నారులు అయితే రోజుకు 11 నుంచి 14 గంటల పాటు నిద్ర పోవాలి.
* 3 నుంచి 5 ఏళ్ల వయస్సు ఉన్నవారు రోజుకు 10 నుంచి 13 గంటల పాటు నిద్రించాలి.
* 6 నుంచి 13 ఏళ్ల వయస్సు ఉన్నవారు రోజుకు 9 నుంచి 11 గంటల పాటు నిద్రపోవాలి.
* 14 నుంచి 17 ఏళ్ల వయస్సు వారు రోజుకు 8 నుంచి 10 గంటల పాటు నిద్రించాల్సి ఉంటుంది.
* 18 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్నవారు రోజుకు 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోవాలి.
* 26 నుంచి 64 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి రోజుకు 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం.
* 65 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్నవారు రోజుకు 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోతే చాలు.
ఈ విధంగా ఎవరైనా సరే తమ వయస్సుకు తగినట్లుగా రోజు తగినన్ని గంటల పాటు నిద్రించాల్సి ఉంటుంది.
నిద్ర సరిగ్గా పోకపోతే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. శరీర మెటబాలిజం గాడి తప్పుతుంది. దీంతో తినే ఆహారం కొవ్వుగా మారి అధిక బరువు పెరుగుతారు. ఫలితంగా టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఒత్తిడి బాగా పెరిగి మానసిక సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి వీటి నుంచి తప్పించుకోవాలంటే రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించడం తప్పనిసరి.