Spicy Aloo Masala Fry : ఆలూ ఫ్రై త‌యారీ ఇలా.. నోట్లో నీళ్లూరాల్సిందే..!

Spicy Aloo Masala Fry : మ‌నం ఆహారంగా తీసుకునే దుంప జాతి కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప ఒక‌టి. దీనితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంప‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బంగాళాదుంప‌తో చేసిన ప్ర‌తి వంట‌కం కూడా చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంప‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా ఫ్రైను త‌యారు చేస్తూ ఉంటాం. ఈ ఫ్రై ను మ‌రింత రుచిగా స్పైసీగా ఎలా త‌యారు చేసుకోవాలి.. తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

స్పైసీ ఆలూ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిన్న‌గా త‌రిగిన బంగాళాదుంప ముక్క‌లు – పావు కిలో, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, నిమ్మ ర‌సం – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Spicy Aloo Masala Fry recipe in telugu very tasty for rice
Spicy Aloo Masala Fry

స్పైసీ ఆలూ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో జీల‌క‌ర్ర‌, ఆవాలు వేసి దోర‌గా వేయించుకోవాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మ‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత‌ క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప ముక్క‌లు వేసి కలుపుతూ వేయించుకోవాలి. బంగాళాదుంప‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో క‌రివేపాకు, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించుకోవాలి. త‌రువాత అల్లం పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించుకోవాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న జీల‌క‌ర్ర పొడి, ఉప్పు, కారం, ప‌సుపు, గ‌రం మ‌సాలా వేసి ఒక నిమిషం పాటు క‌లుపుతూ వేయించుకోవాలి. త‌రువాత వేయించిన బంగాళాదుంప ముక్క‌లు వేసి రెండు నిమిషాల పాటు క‌లుపుకోవాలి.

త‌రువాత పావు గ్లాస్ నీళ్ల‌ను పోసి రెండు నిమిషాల పాటు క‌లుపుకోవాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, కొత్తిమీర వేసి రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి నిమ్మ ర‌సాన్ని వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స్పైసీ ఆలూ ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటి వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ఆలూ ఫ్రైను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. త‌ర‌చూ చేసే ఆలూ ఫ్రై కంటే ఈ విధంగా చేసిన ఆలూ ఫ్రై మ‌రింత రుచిగా ఉంటుంది.

Share
D

Recent Posts