Spicy And Crispy Vada : ప్రోటీన్ ఎక్కువగా ఉండే పప్పు దినుసుల్లో అలసందలు కూడా ఒకటి. అలసందలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో గుగ్గిళ్లు, కూర వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. అలాగే ఈ అలసందలతో మనం వడలను కూడా తయారు చేసుకోవచ్చు. అల్పాహారంగా తీసుకోవడానికి, స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ అలసంద వడలను తయారు చేయడం చాలా తేలిక. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే అలసంద వడలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ అలసంద వడల తయారీకి కావల్సిన పదార్థాలు..
అలసందలు – ఒక కప్పు, మినపగుళ్లు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి – 5 లేదా 6, అల్లం – ఒక ఇంచు ముక్క, ఉప్పు – తగినంత, ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
క్రిస్పీ అలసంద వడల తయారీ విధానం..
ముందుగా గిన్నెలో అలసందలను, మినపప్పును వేసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 8 గంటల పాటు నానబెట్టాలి. తరువాత వీటిని పూర్తిగా నీళ్లు లేకుండా వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత జార్ లో ధనియాలు, జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా మిక్సీపట్టుకోవాలి. తరువాత అదే జార్ లో అల్లం, పచ్చిమిర్చి వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో నానబెట్టిన అలసందలు, ఉప్పు వేసి నీళ్లు వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. దీనిని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి కలపాలి.
తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుని వడ లాగా వత్తుకుని నూనెలో వేసుకోవాలి. వడ మరీ పలుచగా, మరీ మందంగా లేకుండా చూసుకోవాలి. ఈ వడలను మధ్యస్థ మంటపై క్రిస్పీగా, ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అలసంద వడలు తయారవుతాయి. వీటిని చట్నీ లేదా టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన అలసంద వడలను ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.