Srikanth : దర్శకరత్న దాసరి నారాయణ రావు మరణం అనంతరం టాలీవుడ్‌లో ఇండస్ట్రీ పెద్ద ఎవరు ? అనే అంశం దాదాపుగా ప్రతి సారి చర్చకు వస్తోంది. దీనిపై ఇండస్ట్రీ కూడా రెండు వర్గాలుగా చీలిపోయిందని కూడా అంటున్నారు. అప్పుడప్పుడు ఇండస్ట్రీలో ఉండే కొందరి మధ్య విభేదాలు కూడా తలెత్తుతున్నాయి. ఇక ఇండస్ట్రీ పెద్ద ఎవరు ? అనే విషయమై ఎప్పటికప్పుడు చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇక కొందరు మెగాస్టార్ చిరంజీవి వైపు ఉండగా.. కొందరు మాత్రం మోహన్‌బాబుకు మద్దతు తెలిపారు. అందులో భాగంగానే మంచు విష్ణును చాలా మంది మా అధ్యక్షుడిగా కూడా ఎన్నుకున్నారు. అయితే ఇండస్ట్రీకి పెద్ద ఎవరు ? అనే విషయంపై నటుడు శ్రీకాంత్ తాజాగా స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
శ్రీకాంత్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి పెద్ద ఎవరు ? అనే విషయానికి వస్తే.. తాను మెగాస్టార్ చిరంజీవి అనే అంటానని.. ఆ స్థానానికి ఆయనే సరిగ్గా పోతారని.. అన్నారు. ఆయన ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీ కోసం ఎంతో కష్టపడుతున్నారని.. ఎన్నో సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు సాగుతున్నారని అన్నారు. కనుక ఇండస్ట్రీ పెద్ద చిరంజీవే అని శ్రీకాంత్ స్పష్టం చేశారు.
టాలీవుడ్‌కు ఉన్న అనేక సమస్యలను చిరంజీవి ముందుండి పరిష్కరిస్తున్నారని శ్రీకాంత్ అన్నారు. చిరంజీవి వద్దకు ఎవరైనా ఏదైనా సమస్య ఉందని వెళితే తప్పక స్పందించి పరిష్కరిస్తారని అన్నారు. కనుక ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఆయనే అని మరోమారు స్పష్టం చేశారు.
అయితే గతంలో అనేక సార్లు చిరంజీవి ఈ విషయంపై మాట్లాడారు. తాను ఇండస్ట్రీ పెద్దను కాదని, కానీ ఇండస్ట్రీకి లేదా ఇండస్ట్రీలో ఎవరికైనా సమస్య వస్తే పరిష్కరిస్తానని.. తోటి సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుంటానని అన్నారు. ఆయన చెప్పినట్లుగానే ఇటీవలి కాలంలో అనేక సార్లు సీఎం జగన్‌ను కలిసి ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో సమస్యను ఒక కొలిక్కి తెచ్చారు. అయినప్పటికీ ఆయన ఇప్పటికీ తాను టాలీవుడ్‌కు పెద్దను కాదనే అంటారు. అదే విషయాన్ని శ్రీకాంత్ తెలియజేశారు. ఈ క్రమంలో శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.