కూరగాయాలన్నింటిలోనూ వంకాయలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. వాటితో ఏం కూర చేసినా సరే.. భోజన ప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు. ఇక మసాలా కూరిన వంకాయ అయితే.. ఆ పేరు చెబితేనే నోట్లో నీళ్లూరుతుంటాయి. అంతలా ఆ కూర రుచిగా ఉంటుంది. మరి మసాలా కూరిన వంకాయ ఎలా తయారు చేయాలో.. అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
మసాలా కూరిన వంకాయ తయారీకి కావల్సిన పదార్థాలు:
వంకాయలు (పొడవుగా, లావుగా ఉన్నవి) – అరకిలో, వెన్న – 100 గ్రాములు, ఎండు మిరపకాయలు – 8, ధనియాలు – 3 టీస్పూన్లు, జీలకర్ర – 1 టీస్పూన్, శనగపప్పు – 3 టేబుల్ స్పూన్లు, మినపప్పు – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్లు.
మసాలా కూరిన వంకాయ తయారు చేసే విధానం:
పాన్ తీసుకుని అందులో ఎండు మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు విడివిడిగా వేయించుకోవాలి. తరువాత అన్నింటినీ కలిపి మిక్సీలో వేసి పొడిగా పట్టుకోవాలి. కానీ పొడిని మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. అందులో ఉప్పు, వెన్న బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. వంకాయలు కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. ఒక్కో కాయనీ కింది నుంచి నాలుగు భాగాలుగా కోసి కాండం వద్ద వదిలేయాలి. అనంతరం కాయలో వెన్న కలిపిన పొడిని కూరాలి. లోపలి నుంచి మసాలా బయటకు రాకుండా కాయలను దారంతో కట్టాలి. అనంతరం పాన్ తీసుకుని నూనె వేసి కాయలన్నింటినీ పక్క పక్కనే పాన్‌లో పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు కాయలను బాగా ఫ్రై చేయాలి. తరువాత కాయలను రెండో వైపుకు తిప్పుకుని కూడా అలాగే వేయించుకోవాలి. దీంతో రుచికరమైన మసాలా కూరిన వంకాయ రెడీ అవుతుంది. ఈ కాయలను అన్నంలో లేదా చపాతీలో అంచుకు తింటే బాగుంటాయి.