Sunil : పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో సినీ నటుడు సునీల్ చేరబోతున్నారని తాజాగా వార్తలు వస్తున్న విషయం విదితమే. సునీల్ జనసేన పార్టీలో చేరితే.. ఆయనను భీమవరం నుంచి పోటీలో దించాలని పవన్ అనుకుంటున్నారని.. కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై సునీల్ స్వయంగా స్పందించారు. తన రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ అసలు సునీల్ ఈ విషయంపై ఏమన్నారంటే..
తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయని.. అయితే వాటిల్లో ఎంత మాత్రం నిజం లేదని.. అవి పూర్తిగా అబద్ధమేనని తెలిపారు. తనకు పవన్ కల్యాణ్ అన్నా.. చిరంజీవి అన్నా.. చాలా ఇష్టమని.. అయితే అది సినిమాల వరకేనని.. తనకు రాజకీయాలు అంటే ఇష్టం లేదని.. కనుక ఎట్టి పరిస్థితిలోనూ రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదన్నారు. తనకు రాజకీయాలు తెలియవని.. కనుక తనకు అవి పడవని అన్నారు.
పవన్ కల్యాణ్‌తో తనకు మంచి అనుబంధం ఉందని.. ఆయన తనతో చాలా క్లోజ్‌గా ఉంటారని సునీల్ అన్నారు. అయితే ఈ విధమైన చనువు వల్ల సహజంగానే వార్తలు వస్తున్నాయని.. కానీ వాటిల్లో నిజం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రావాలంటే ఫండ్స్ ఉండాలి. ఫండ్స్ లేకపోతే కష్టం. ఎందుకంటే అందరినీ మేనేజ్ చేయాలంటే ఫండ్స్ సరిపోవు. కనుక ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే బాగుండదు. అలాంటి స్థితిలో రాజకీయాలు చేయలేం. కనుక నాకు రాజకీయాలు సరిపడవు.. అని సునీల్ అన్నారు. దీంతో ఈ వార్తల్లో నిజం లేదని అర్థమైంది.