Sweet Shop Style Pakoda : మనకు సాయంత్రం సమయంలో స్నాక్స్ గా తీసుకునే వాటిల్లో పకోడీలు ఒకటి. పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. మనం ఇంట్లో కూడా వీటిని తయారు చేస్తూ ఉంటాం. చాలా మంది పకోడీలను కరకరలాడుతూ ఉండేలా తయారు చేస్తారు. కేవలం కరకరలాడుతూ ఉండే పకోడీలనే కాకుండా మనం మెత్తని పకోడీలను కూడా తయారు చేసుకోవచ్చ. ఇవి మనకు స్వీట్ షాపుల్లో ఎక్కువగా లభిస్తాయి. ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఈ మెత్తని పకోడీలను తయారు చేయడం కూడా చాలా తేలిక. అచ్చం స్వీట్ షాపుల్లో లభించే విధంగా రుచిగా, మెత్తగా ఉండే పకోడీలను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మెత్తని పకోడా తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 5, కరివేపాకు – రెండు రెమ్మలు, జీలకర్ర – అర టీ స్పూన్, శనగపిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంత, పసుపు – రెండు చిటికెలు, వంటసోడా – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, నీళ్లు – అర కప్పు లేదా ముప్పావు కప్పు.
మెత్తని పకోడా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలను తీసుకోవాలి. తరువాత నూనె, నీళ్లు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని జారుడుగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పకోడీలను వేసుకోవాలి. ఈ పకోడీలను మధ్యస్థ మంటపై అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్వీట్ షాప్ స్టైల్ మెత్తని పకోడీలు తయారవుతాయి. తరచూ చేసే పకోడీలతో పాటు అప్పుడప్పుడూ ఇలా మెత్తని పకోడీలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఈ పకోడీలు చాలా చక్కగా ఉంటాయి. ఈ పకోడీలను విడిచిపెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.