Tawa Chicken Fry : మనలో చాలా మంది చికెన్ తో చేసిన వంటకాలను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ తో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. మనకు రెస్టారెంట్ లలో లభించే చికెన్ వంటకాల్లో తవా చికెన్ ఫ్రై కూడా ఒకటి. పెనం మీద వేసి వేయించి చేసే ఈ చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఇది తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ కు వెళ్లే పని లేకుండా ఈ తవా చికెన్ ఫ్రైను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే తవా చికెన్ ఫ్రై ను హైదరాబాద్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ స్టైల్ తవా చికెన్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
గంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ – అర కిలో, ఎండుమిర్చి – 12, జీలకర్ర – ఒక టీ స్పూన్, మిరియాలు -ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 5, యాలకులు – 5, చిన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ – 1, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు – కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, టమాట – 1, నిమ్మరసం – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, వేయించిన కరివేపాకు – రెండు రెమ్మలు, వేయించిన పచ్చిమిర్చి – 4.
హైదరాబాద్ స్టైల్ తవా చికెన్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, మిరియాలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. తరువాత వీటన్నింటిని ఒక జార్ లోకి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద తవాను ఉంచి నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత చికెన్ వేసి కలపాలి. దీనిని 3 నిమిషాల పాటు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు వేయించిన తరువాత టమాటను ఫ్యూరీగా చేసి వేసుకుని కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కలపాలి. ఇప్పుడు 50 ఎమ్ ఎల్ నీళ్లు చల్లుకుని కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచి 10 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై వేయించాలి. తరువాత మూత తీసి మరో 5 నిమిషాలు వేయించాలి.
తరువాత మరో 50 ఎమ్ ఎల్ నీళ్లు చల్లుకుని కలపాలి. తరువాత మరలా మూతను ఉంచి మరో 10 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మూత తీసి అంతా కలిసేలా కలుపుకుంటూ వేయించాలి. చికెన్ చక్కగా వేగిన తరువాత నిమ్మరసం, కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ప్లేట్ లోకి తీసుకుని కరివేపాకు, పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తవా చికెన్ ఫ్రై తయారవుతుంది. దీనిని చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ లకు వెళ్లే పని లేకుండా ఈ విధంగా తవా చికెన్ ను ఇంట్లోనే తయారు చేసుకుని తినవచ్చు. ఈ చికెన్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.