Telangana Style Mutton Curry : తెలంగాణ స్టైల్ మ‌ట‌న్ క‌ర్రీని ఇలా చేయండి.. ఘాటుగా, రుచిగా ఉంటుంది..!

Telangana Style Mutton Curry : మాంసాహారాల్లో మ‌న‌కు మ‌ట‌న్ అన‌గానే ముందుగా గుర్తుకు వ‌చ్చేది బిర్యానీ. మ‌ట‌న్ తో చేసే బిర్యానీ ఎంతో రుచిగా ఉంటుంది. అయితే మ‌ట‌న్‌తో కేవ‌లం బిర్యానీనే కాకుండా అనేక ఇత‌ర వంట‌కాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే మ‌ట‌న్‌తో తెలంగాణ స్టైల్‌లో కూర‌ను కూడా చేసుకోవ‌చ్చు. ఇది ఎంతో ఘాటుగా, రుచిగా ఉంటుంది. దీన్ని త‌యారు చేయ‌డం చాలా సుల‌భ‌మే. ఇక తెలంగాణ స్టైల్‌లో మ‌ట‌న్ కర్రీని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Telangana Style Mutton Curry this is the way for perfect cooking
Telangana Style Mutton Curry

తెలంగాణ స్టైల్ మ‌ట‌న్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మ‌ట‌న్ – అర కిలో, ఉల్లిపాయ‌లు స‌న్న‌గా త‌రిగిన‌వి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు, ప‌సుపు – అర టీస్పూన్‌, నూనె – 2 టేబుల్ స్పూన్లు, జీల‌క‌ర్ర – 2 టీస్పూన్లు, ధ‌నియాలు – 2 టీస్పూన్లు, గ‌స‌గ‌సాలు – 2 టీస్పూన్లు, కొబ్బ‌రిపొడి – ఒక టేబుల్ స్పూన్‌, సాజీరా – ఒక టీస్పూన్‌, ల‌వంగాలు – 4, యాల‌కులు – 2, దాల్చిన చెక్క – 3 చిన్న ముక్క‌లు, నీళ్లు – త‌గిన‌న్ని, ఉప్పు – 2 టీస్పూన్లు, కారం – 2 టీస్పూన్లు.

తెలంగాణ స్టైల్ మ‌ట‌న్ క‌ర్రీని త‌యారు చేసే విధానం..

ముందుగా మ‌ట‌న్‌ను శుభ్రంగా క‌డిగి ప‌క్క‌న పెట్టాలి. త‌రువాత కుక్క‌ర్‌లో నూనె వేసి కాగాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి రంగు మారిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ప‌సుపు వేసి క‌లిపి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మ‌ట‌న్‌ను వేయాలి. అంతా క‌లిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. దీంతో నీరు బ‌య‌ట‌కు వ‌స్తుంటుంది. త‌రువాత జీల‌క‌ర్ర‌, ధ‌నియాలు, గ‌స‌గ‌సాలు, కొబ్బ‌రిపొడి, సాజీరాల‌ను వేర్వేరుగా పెనంపై వేయించి చ‌ల్లారాక మిక్సీలో వేసి పొడిగా ప‌ట్టుకోవాలి. అలాగే ల‌వంగాలు, యాల‌కులు, దాల్చిన చెక్క ముక్క‌ల‌ను కూడా దండి పొడిలా చేయాలి. ఈ రెండు పొడిల‌ను మ‌ట‌న్‌లో వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత ఉప్పు, కారం వేసి క‌లిపి.. కాసిన్ని నీళ్లు పోసి మూత పెట్టాలి. కుక్క‌ర్ 3 లేదా 4 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు మ‌ట‌న్‌ను బాగా ఉడికించాలి.

విజిల్స్ వ‌చ్చాక మూత తీసి బాగా క‌ల‌పాలి. ఇప్పుడు ఉప్పు రుచి చూసి అవ‌స‌రం అనుకుంటే మరికాస్త క‌లుపుకోవ‌చ్చు. ఈ స్థితిలో మ‌ట‌న్‌లో నీళ్లుంటాయి. చ‌పాతీ, పూరీల‌తో కావాల‌నుకుంటే మ‌ట‌న్‌ను ఇక్క‌డే కొత్తిమీర వేసి దింపేయ‌వ‌చ్చు. లేదా ఇంకా గ‌ట్టిగా కావాల‌నుకుంటే మూత తీసి ఉంచే మ‌ట‌న్‌ను 5 నిమిషాల పాటు ఉడికించాలి. దీంతో నీరు పోతుంది. కూర ద‌గ్గ‌రికి అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేయాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే తెలంగాణ స్టైల్ మ‌ట‌న్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీన్ని అన్నంలో తిన‌వ‌చ్చు. లేదా చ‌పాతీ, పూరీ వంటి వాటితోనూ తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. ఘాటుద‌నం కావాల‌నుకుంటే మ‌ట‌న్‌ను ఇలా వండుకోవ‌చ్చు. ఇలా మ‌ట‌న్‌ను ఎంతో రుచిగా ఆస్వాదించ‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts