Telangana Style Pachi Pulusu : పచ్చి పులుసు.. ఈ వంటకం తెలియని వారు అలాగే దీనిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. పచ్చి పులుసు పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చిపులుసును అప్పుడప్పుడూ తయారు చేస్తూనే ఉంటారు. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఈ పచ్చి పులుసును మనం తయారు చేసుకోవచ్చు. కమ్మగా, రుచిగా ఉండే ఈ పచ్చి పులుసును తెలంగాణా స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణా స్టైల్ పచ్చి పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, చింతపండు పులుసు – 2 కప్పులు.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఎండుమిర్చి గింజలు – ఒక టీ స్పూన్.
తెలంగాణా స్టైల్ పచ్చి పులుసు తయారీ విధానం..
ముందుగా మంటపై పచ్చిమిర్చిని కాల్చుకోవాలి. తరువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు వేసి నలుపుతూ బాగా కలుపుకోవాలి. తరువాత చింతపండు రసం వేసి మరోసారి నలుపుతూ కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి. తరువాత ఈ తాళింపును పచ్చిపులుసులో వేసి మూత పెట్టాలి. దీనిని ఒక నిమిషం పాటు అలాగే ఉంచిన తరువాత కలుపుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పచ్చి పులుసు తయారవుతుంది. దీనిని ముద్దపప్పుతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే వేపుడు కూరల్లోకి కూడా ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది. సమయం తక్కువగా ఉన్నప్పుడు లేదా నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా పచ్చి పులుసును తయారు చేసుకుని తినవచ్చు. ఈ పచ్చి పులుసును లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.