Thapala Chekka : తెలంగాణా సాంప్రదాయ వంటకాల్లో తపాల చెక్క కూడా ఒకటి. దీనిని సర్వపిండి అని కూడా అంటారు. తపాల చెక్కలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. బియ్యంపిండితో చేసే ఈ తపాల చెక్కలను మరింత రుచిగా అలాగే ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా తయారు చేసుకోవచ్చు. మరింత రుచిగా, తక్కువ నూనెతో, ఆరోగ్యానికి మేలు చేసేలా ఈ తపాల చెక్కలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తపాల చెక్క తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలిష్ చేయని బియ్యంపిండి – ఒక కప్పు, రాగిపిండి – పావు కప్పు, జొన్న పిండి – పావు కప్పు, ఉప్పు – తగినంత, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, చిన్నగా తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, గంటపాటు నానబెట్టిన శనగపప్పు – పావు కప్పు, నువ్వులు – 2 టీ స్పూన్స్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, జీలకర్ర – ఒక టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు, నూనె – ఒక టేబుల్ స్పూన్.
తపాల చెక్క తయారీ విధానం..
ముందుగా గిన్నెలో బియ్యంపిండి, రాగిపిండి, జొన్నపిండిని తీసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత గుంతగా ఉండే కళాయిని తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి టిష్యూ పేపర్ తో తుడుచుకోవాలి. తరువాత దీనిని పొగ వచ్చే వరకు వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిని పక్కకు తీసి చల్లారే వరకు ఉంచాలి. తరువాత ఇందులో నూనె వేసి కళాయి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత ఇందులో పిండిని ఉంచి అంతా సమానంగా వచ్చేలా పలుచగా వత్తుకోవాలి.
తరువాత దీనికి అక్కడక్కడ రంధ్రాలు చేసుకుని నూనె వేసుకోవాలి. తరువాత ఈ కళాయిని స్టవ్ మీద ఉంచి మూత పెట్టి 10 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మూత తీసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తపాల చెక్క తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన తపాల చెక్కను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే దీనిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.