Thokkudu Laddu : తొక్కుడు ల‌డ్డూల‌ను త‌యారు చేయ‌డం సుల‌భ‌మే.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Thokkudu Laddu : మ‌నం వంటింట్లో త‌యారు చేసే తీపి ప‌దార్థాల‌లో ల‌డ్డూ కూడా ఒక‌టి. మ‌నం వివిధ ర‌కాల ల‌డ్డూల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌న‌కు బ‌య‌ట మార్కెట్ లో కూడా అనేక రకాల ల‌డ్డూలు ల‌భిస్తాయి. మ‌నం ఇంట్లో త‌యారు చేసుకోవ‌డానికి వీలుగా ఉండే ల‌డ్డూల‌లో తొక్కుడు ల‌డ్డూ కూడా ఒక‌టి. తొక్కుడు ల‌డ్డూ చాలా రుచిగా ఉంటుంది. ఈ ల‌డ్డూని మ‌న‌లో చాలా మంది తినే ఉంటారు. ఇత‌ర ల‌డ్డూల కంటే కొద్దిగా భిన్నంగా దీనిని త‌యారు చేస్తారు. చాలా సులువుగా, చాలా రుచిగా తొక్కుడు ల‌డ్డూల‌ని ఎలా త‌యారు చేసుకోవాలి.. వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

తొక్కుడు ల‌డ్డూ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

శ‌న‌గ పిండి – ఒక క‌ప్పు, ఉప్పు – చిటికెడు, ఫుడ్ క‌ల‌ర్ – చిటికెడు, నీళ్లు – త‌గిన‌న్ని, పంచ‌దార – ముప్పావు క‌ప్పు, నీళ్లు – పావు క‌ప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, నూనె -డీప్‌ ఫ్రై కి స‌రిప‌డా.

Thokkudu Laddu here it is how you can make them
Thokkudu Laddu

తొక్కుడు ల‌డ్డూ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో శ‌న‌గ పిండిని తీసుకుని దానిలో ఉప్పు, ఫుడ్ క‌ల‌ర్ వేసి క‌లుపుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ మెత్త‌గా క‌లుపుకోవాలి. త‌రువాత కార పూస వ‌త్తుకునే గిద్దెల‌ను తీసుకుని వాటికి నూనెను రాసి త‌గింన‌త పిండిని గిద్దెల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి నూనె కాగిన త‌రువాత కార పూస వ‌త్తుకుని మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా రెండు నిమిషాల‌ల్లో కాల్చుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మిగిలిన పిండితో కూడా కార‌పూస‌నంత‌టినీ వ‌త్తుకోవాలి. ఈ కార‌పూస చ‌ల్ల‌గా అయిన త‌రువాత ముక్క‌లుగా చేసి ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడి అయ్యే వ‌ర‌కు మిక్సీ ప‌ట్టుకోవాలి.

త‌రువాత ఒక కళాయిలో పంచ‌దార‌ను, నీటిని పోసి పంచ‌దార క‌రిగే వ‌ర‌కు తిప్పుతూ ఉండాలి. పంచ‌దార క‌రిగిన త‌రువాత లేత పాకం వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. పంచ‌దార లేత పాకం వ‌చ్చిన త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న కార‌పూస మిశ్ర‌మాన్ని వేసి ఉండ‌లు లేకుండా బాగా క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని పూర్తిగా దగ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. స్ట‌వ్ ఆఫ్ చేసిన త‌రువాత నెయ్యిని వేసి బాగా క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మం గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత చేతికి నెయ్యిని రాసుకుంటూ కావ‌ల్సిన ప‌రిమాణంలో తీసుకుంటూ ల‌డ్డూలుగా వ‌త్తుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న ల‌డ్డూల‌ను మ‌న‌కు న‌చ్చిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే తొక్కుడు ల‌డ్డూలు త‌యార‌వుతాయి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల బ‌య‌ట దొరికే విధంగా ఉండే తొక్కుడు ల‌డ్డూల‌ను మ‌నం ఇంట్లోనే చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు.

D

Recent Posts