Thunakam Sweet : పాత‌కాలం నాటి సంప్ర‌దాయ తీపి వంట‌కం.. ఇలా చేయాలి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Thunakam Sweet : తున‌కం.. దీనినే తేనె రొట్టె, కొబ్బ‌రి రొట్టె అని పిలుస్తారు. ఈ తున‌కాన్ని ఎక్కువ‌గా పాత కాలంలో త‌యారు చేసేవారు. బియ్యం, ప‌చ్చికొబ్బ‌రి, బెల్లంతో చేసే ఈ తున‌కం చాలా రుచిగా ఉంటుంది. ఇది చూడ‌డానికి అచ్చం కేక్ లాగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. దీనిని తయారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ తున‌కం స్వీట్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

తున‌కం స్వీట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం – ఒక క‌ప్పు, ప‌చ్చి కొబ్బ‌రి తురుము – ఒక కప్పు, బెల్లం తురుము – ఒక క‌ప్పు, ఉప్పు – చిటికెడు, నీళ్లు – రెండున్న‌ర క‌ప్పులు, నూనె – 3 టేబుల్ స్పూన్స్.

Thunakam Sweet recipe in telugu very tasty how to make it
Thunakam Sweet

తున‌కం స్వీట్ త‌యారీ విధానం..

ముందుగా బియ్యాన్ని క‌ళాయిలో వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని ర‌వ్వ లాగా మిక్సీ పట్టుకోవాలి. త‌రువాత ఈ ర‌వ్వ‌ను క‌ళాయిలోకి తీసుకుని ఇందులో కొబ్బ‌రి తురుము, బెల్లం తురుము, ఉప్పు, నీళ్లు పోసి క‌ల‌పాలి. బెల్లం క‌రిగే వ‌ర‌కు దీనిని క‌లిపిన త‌రువాత ఈ క‌ళాయిని స్ట‌వ్ మీద ఉంచి ఉడికించాలి. బియ్యం ర‌వ్వ చ‌క్క‌గా ఉడికి ద‌గ్గ‌ర ప‌డిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే చిన్న క‌ళాయిలో ముందుగా నూనె వేసి క‌ళాయి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. త‌రువాత ఉడికించిన బియ్యం ర‌వ్వ‌ను వేసి పైన స‌మానంగా చేసుకోవాలి. త‌రువాత మూత పెట్టి 10 నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

దీనిని అర‌గంట పాటు అలాగే ఉంచిన త‌రువాత క‌ళాయి నుండి వేరు చేసుకుని పెనం మీద వేసుకోవాలి. ఇప్పుడు దీనికి అన్ని వైపులా నూనె వేసుకుని మ‌రో 5 నిమిషాల పాటు కాల్చుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పెనం మీద వేసి కాల్చుకోవ‌డం వ‌ల్ల తున‌కం రెండు వైపులా చ‌క్క‌గా వేగుతుంది. దీనిని చ‌ల్లారిన త‌రువాత మ‌న‌కు కావ‌ల్సిన ఆకారంలో క‌ట్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే తున‌కం స్వీట్ త‌యారవుతుంది. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా తున‌కాన్ని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. పిల్ల‌ల‌కు ఎప్పుడూ పంచ‌దార‌తో చేసే కేక్స్ ను కాకుండా ఇలా కొబ్బ‌రి, బెల్లంతో తున‌కాన్ని త‌యారు చేసి పెట్ట‌వ‌చ్చు.

Share
D

Recent Posts