Warm Water : మనలో చాలా మంది ఉదయం లేవగానే నీటిని ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది. అలాగే కొందరు ఉదయం లేవగానే గోరు వెచ్చని నీటిని తాగుతూ ఉంటారు. ఇలా ఉదయం లేచిన వెంటనే గోరు నీటిని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. ఉదయం పరగడుపున నీళ్లు తాగడంతో పాటు నిషి ఉష్ణోదక పానీయం అనగా రాత్రి పడుకునే ముందు కూడా వేడి నీటిని తాగడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పూట వేడి నీటిని ఎలా తాగాలి.. ఏ సమయంలో తాగాలి.. అలాగే ఇలా తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి పూట ఒక గ్లాస్ నీటిని అర గ్లాస్ లేదా పావు గ్లాస్ అయ్యే వరకు లేదా రెండు గ్లాసుల నీటిని ఒక గ్లాస్ అయ్యే వరకు మరిగించుకుని తాగాలి.
దీనిని అర్థ భాగ ఉష్ణోదకం లేదా చతుర్భాగ ఉష్ణోదకం అని పిలుస్తారు. పిల్లలకు అర్థభాగం వయ్యే వరకు మరిగించిన నీటిని పెద్ద వారు పావు భాగం వరకు మరిగించిన నీటిని తాగాలి. ఇలా మరిగించిన నీటిని రాత్రి భోజనం చేసిన రెండు గంటల తరువాత తాగాలి. చాలా మంది జ్యూస్, పాలు, మజ్జిగ వంటి వాటిని తాగుతూ ఉంటారు. వీటికి బదులుగా రాత్రిపూట వేడి నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా వేడి నీటిని తాగడం వల్ల ఆకలి శక్తి పెరుగుతుంది. అజీర్తి, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. ప్రేగుల్లో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి. అలాగే వేడి నీటిని తాగడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
ఉదయం పూట లేచిన తరువాత చాలా మందికి తుమ్ములు రావడం, ముక్కు నుండి నీళ్లు కారడం వంటివి జరుగుతుంది. అలాంటి వారు రాత్రి పడుకునే ముందు వేడి నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే జ్వరంతో బాధపడుతున్నప్పుడు రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లు తాగడం వల్ల జ్వరం త్వరగా తగ్గుతుంది. అదేవిధంగా రాత్రి పడుకునే ముందు వేడి నీటిని తాగి పడుకోవడం వల్ల మరుసటి రోజూ రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. నీరసం, నిస్సత్తువ వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అదే విధంగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు ఇలా రాత్రిపూట వేడి నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది.
అలాగే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్న వారు కూడా ఇలా వేడి నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రాత్రి భోజనం చేసిన 2 గంటల తరువాత ఇలా వేడి నీటిని తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయని వేడి నీటిని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.