Ulli Avakaya : ఉల్లి ఆవకాయ.. మామిడికాయలతో తయారు చేసుకోగలిగిన రుచికరమైన పచ్చళ్లల్లో ఇది కూడా ఒకటి. మామిడికాయ తురుముతో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు అల్పాహారాలతో తినడానికి చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఈ ఉల్లి ఆవకాయ 6 నెలల పాటు నిల్వ కూడా ఉంటుంది. ఈ పచ్చడిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పచ్చడి పెట్టడం రాని వారు కూడా దీనిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ ఉల్లి ఆవకాయను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పుల్లటి మామిడికాయలు – 4, మెంతులు – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – 3 టేబుల్ స్పూన్స్, దంచిన వెల్లుల్లి రెబ్బలు- అర కప్పు, ఉప్పు – 1/3 కప్పు, కారం – 1/3 కప్పు, నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె – ఒక కప్పు.
ముందుగా మామిడికాయలను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టాలి. ఇప్పుడు వాటిపై ఉండే తొక్కను తీసేసి మామిడికాయలను తురుముకోవాలి. వీటిని మరీ చిన్నగా కాకుండా పెద్ద రంధ్రాలు ఉన్న వైపు తురుముకోవాలి. ఇలా తురుముకున్న తరువాత దీనిని రెండు గంటల పాటు ఎండలో ఆరబెట్టాలి. ఇప్పుడు కళాయిలో ఆవాలు, మెంతులు వేసి వేయించాలి. వీటిని పొడిగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులోనే కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండబెట్టుకున్న మామిడి తురుము వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత నూనె వేసి కలుపుకోవాలి. దీనిని గాజు సీసాలో వేసి ఒక రోజంతా ఊరబెట్టుకోవాలి. తరువాత అంతా కలిసేలా కలుపుకుని అవసరమైతే మరికొద్దిగా నూనె వేసుకుని కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లి ఆవకాయ తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చాలా సులభంగా ఎవరైనా ఉల్లి ఆవకాయను తయారు చేసుకుని తినవచ్చు.