Ullipaya Pachadi : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే నానుడి మనకు చాలా కాలం నుండి వాడుకలో ఉంది. ఉల్లిపాయ మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఉల్లిపాయను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఉల్లిపాయలో శరీరానికి కావల్సిన పోషకాలన్నీ ఉంటాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉల్లిపాయ సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా కలిగిన ఆహారాల్లో ఉల్లిపాయలు ఒకటి.
ఉల్లిపాయ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఎముకలను దృఢంగా ఉంచడంలో, జీర్ణ శక్తిని మెరుగుపరచడంలోనూ ఉల్లిపాయ ఉపయోగపడుతుంది. జుట్టు పెరుగుదలలో కూడా ఉల్లిపాయ దోహదపడుతుంది. అనేక రకాల ఆహార పదార్థాల తయారీలో మనం ఉల్లిపాయలను ఉపయోగిస్తూ ఉన్నాం. వంటల తయారీలోనే కాకుండా ఉల్లిపాయలతో కారాన్ని కూడా తయారు చేస్తూ ఉన్నాం. ఇవి మాత్రమే కాకుండా ఉల్లిపాయతో పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయతో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయతో పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, ఎండు మిర్చి – 20 నుండి 25, నానబెట్టిన చింతపండు – 50 గ్రా., ధనియాలు – 2 టీ స్పూన్స్, మెంతులు – అర టీ స్పూన్,నీళ్లు – ఒక గ్లాసు, వెల్లుల్లి రెబ్బలు – 10, నీళ్లు – 3 టీ స్పూన్స్.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
ఆవాలు – అర టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఎండు మిర్చి – 2, పసుపు – పావు టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, కరివేపాకు – రెండు రెబ్బలు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – 5 టీ స్పూన్స్.
ఉల్లిపాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి కాగిన తరువాత ఎండు మిర్చిని వేసి చిన్న మంటపై రంగు మారే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత మెంతులు, ధనియాలు వేసి కలుపుతూ వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లగా అయ్యే వరకు ఉంచి జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. అదే కళాయిలో 2 టీ స్పూన్స్ నూనె వేసి నూనె కాగిన తరువాత తరిగిన ఉల్లిపాయలు, చిటికెడు ఉప్పు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత నానబెట్టిన చింతపండును నీళ్లతో సహా వేసి కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తరువాత పసుపు, ఉప్పు, ముందుగా మిక్సీ పట్టుకున్న ఎండు మిరపకాయల మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లను పోసి కలిపి నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచిన తరువాత జార్ లో వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత తాళింపు పదార్థాలను వేసి వేయించుకోవాలి. తాళింపు వేగిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి కలిపి 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ పచ్చడి తయారవుతుంది. ఇలా తయారు చేసిన పచ్చడిని గాలి తగలకుండా నిల్వ చేయడం వల్ల పది రోజుల పాటు తాజాగా ఉంటుంది. దీనిని అన్నం, దోశ, ఇడ్లీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉండడమే కాకుండా ఉల్లిపాయల వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.