Usirikaya Nilva Pachadi : మనం వివిధ రకాల నిల్వ పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. కాలానుగుణంగా ఆయా కాలాల్లో లభించే వాటితో నిల్వ పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. ఇలా మనం తయారు చేసే నిల్వ పచ్చళ్లల్లో ఉసిరికాయ పచ్చడి కూడా ఒకటి. ఉసిరికాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ ఉసిరికాయ పచ్చడిని తయారు చేయడం కూడా చాలా సులభం. మొదటిసారి చేసే వారు కూడా కింద చెప్పిన విధంగా చేయడం వల్ల సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. చాలా సులభంగా, రుచిగా, పక్కా కొలతలతో ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరికాయ నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉసిరికాయలు – అరకిలో, వేడి నీళ్లు – ముప్పావు కప్పు, చింతపండు – 60 గ్రా., ఆవాలు – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – అర టేబుల్ స్పూన్, పల్లి నూనె – పావు లీటర్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, పసుపు – ఒక టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు – 15, ఉప్పు – 50 గ్రా., కారం – 50 గ్రా.
ఉసిరికాయ నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత చింతపండును శుభ్రం చేసుకుని అందులో నీళ్లు పోసి నానబెట్టాలి. తరువాత ఆవాలను, మెంతులను వేయించి పొడిగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత జార్ లో నానబెట్టిన చింతపండును వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూఎ వేడయ్యాక ఉసిరికాయలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై రంగు మారే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో ఒక టీ స్పూన్, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి.
తరువాత కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న చింతపండు, పసుపు వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత వెల్లుల్లి రెబ్బలు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని చల్లారే వరకు అలాగే ఉంచాలి. ఇప్పుడు ఉసిరికాయల్లో ఉప్పు, కారం, మిక్సీ పట్టుకున్న ఆవాల పొడి వేసి కలపాలి. తరువాత చింతపండు గుజ్జు వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకుని మూత పెట్టి 3 రోజులపాటు ఊరబెట్టాలి. పచ్చడిని రోజూ ఒకసారి కలుపుతూ ఉండాలి. పచ్చడి ఊరి నూనె పైకి తేలిన తరువాత దీనిని గాజు సీసాలో లేదా జాడీలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ నిల్వ పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన పచ్చడిని లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.