Carrot Rice : మనం వంటింట్లో వివిధ రకాల రైస్ వెరైటీలను తయారు చేస్తూ ఉంటాము. రైస్ వెరైటీలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. మనం సులభంగా చేసుకోదగిన రైస్ వెరైటీలల్లో క్యారెట్ రైస్ కూడా ఒకటి. క్యారెట్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు దీనిని తయారు చేసి తీసుకోవచ్చు. అలాగే లంచ్ బాక్స్ లోకి కూడా ఈ రైస్ చాలా చక్కగా ఉంటుంది. ఈ రైస్ ను తయారు చేయడం చాలా తేలిక. 10 నిమిషాల్లోనే ఈ రైస్ ను తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే క్యారెట్ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – పావు కప్పు, దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క, బిర్యానీ ఆకులు – 2, లవంగాలు – 5, యాలకులు – 5, జీడిపప్పు – 15, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, క్యారెట్ తురుము – ఒక కప్పు, ఉప్పు – తగినంత, సాంబార్ పొడి – ఒక టీస్పూన్, అన్నం – ఒక కప్పు బియ్యంతో వండినంత, పచ్చికొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్స్, నిమ్మరసం – అర చెక్క, కొత్తిమీర – కొద్దిగా.
క్యారెట్ రైస్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు, జీడిపప్పు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తరువాత క్యారెట్ తురుము వేసి కలపాలి. దీనిని 5నిమిషాల పాటు వేయించిన తరువాత ఉప్పు, సాంబార్ పొడి వేసి కలపాలి. తరువాత అన్నం వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత పచ్చికొబ్బరి తురుము వేసి కలపాలి. తరువాత నిమ్మరసం, కొత్తిమీరవేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాచేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ రైస్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. క్యారెట్ తినని పిల్లలకు ఇలా క్యారెట్ తో రైస్ చేసి ఇవ్వడం వల్ల రుచితో పాటు పోషకాలను అందించవచ్చు.