ఏ బంధాలైనా నమ్మకం పైనే నిలబడతాయి. ఒకరి మీద నమ్మకం కలగాలంటే నిజాయితీగా ఉండడం ముఖ్యం. పవిత్రమైన వివాహ బంధంలో ఉన్నప్పుడు ఎలాంటి దాపరికాలకు, అబద్దాలకు తావు ఉండకూడదు. అదే సమయంలో నిజం మాట్లాడడం కూడా కొన్నిసార్లు మీ సంబంధం పై భారం అవుతుంది. నిక్కచ్చిగా నిజం చెబితే భాగస్వామి కచ్చితంగా మనస్థాపం చెందవచ్చు. అలాగే మీ భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి ఈ 4 అబద్ధాలను ఆడక తప్పదు. భాగస్వామితో ఈ అబద్ధాలు చెబితే మీ మధ్య ప్రేమ మరింత పెరుగుతుందట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది తమ భాగస్వామి పట్ల ఎంతో మక్కువతో వంటలు చేస్తుంటారు. వారు అంత కష్టపడి ప్రేమతో వండిన ఆహారం బాగోలేకపోతే మీరు ఆహారం బాగోలేదు అని కాకుండా బాగుంది అని ప్రశంసలు ఇవ్వడం ద్వారా మీ భాగస్వామిని సంతోష పెట్టవచ్చు.
కొన్నిసార్లు మీ భాగస్వామి కొత్తగా ఏదైనా ప్రయత్నించాలని కోరుకోవచ్చు. అది దుస్తుల విషయమైనా లేదా హెయిర్ స్టైల్ అయినా దానిని చూసి నవ్వడం చేయకూడదు. దీని కారణంగా మీ భాగస్వామి చెడుగా భావించవచ్చు. కాబట్టి భాగస్వామిని ఎగతాళి చేసే బదులు వారి మార్పును అభినందించండి. చాలాసార్లు మీ భాగస్వామి తీసుకునే కొన్ని నిర్ణయాలను మీరు ఇష్టపడకపోవచ్చు. వారి నిర్ణయాలకి వ్యతిరేకంగా వెళ్లడానికి ప్రయత్నించకుండా వారికి మద్దతుగా నిలవండి. మీ భాగస్వామి ఏదైనా నిర్ణయంపై అభ్యంతరాలు ఉన్నప్పటికీ మీరు అబద్ధం చెప్పడం ద్వారా వారి విశ్వాసాన్ని పెంచవచ్చు.
భాగస్వామిని సంతోష పెట్టడానికి కొందరు సర్ప్రైజ్ గిఫ్టులు కూడా ఇస్తుంటారు. కొంతమందికి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఈ విషయంలో భాగస్వామితో నిజం మాట్లాడడం వారిని బాధపెడుతుంది. అందువల్ల మీ భాగస్వామిని సంతోషపరచడానికి ఈ నాలుగు విషయాలలో అబద్ధాలు చెబితే మీ మధ్య ప్రేమ పెరుగుతుందట.