Veg Puff : ఓవెన్ లేకున్నా స‌రే బేక‌రీ స్టైల్‌లో వెజ్ ప‌ఫ్‌ను ఇలా చేయండి..!

Veg Puff : మ‌న‌కు బేక‌రీలల్లో ల‌భించే వాటిల్లో వెజ్ ప‌ఫ్స్ కూడా ఒక‌టి. వెజ్ ప‌ఫ్స్ క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ట‌మాట సాస్ తో తింటే వెజ్ పఫ్స్ మ‌రింత రుచిగా ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ వెజ్ ప‌ఫ్స్ ను అదే రుచితో అదే స్టైల్ లో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. అలాగే ఒవెన్ లేక‌పోయినా కూడా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. బేక‌రీ స్టైల్ లో ఇంట్లోనే వెజ్ ప‌ఫ్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వెజ్ ప‌ఫ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ఫ్ పేస్ట్రీ – పెద్ద‌ది ఒక‌టి, నూనె – 2 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, ప‌సుపు – చిటికెడు, కారం – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, జీల‌క‌ర్ర పొడి – పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – పావు టీ స్పూన్, చాట్ మ‌సాలా – పావు టీ స్పూన్, చిన్న‌గా తరిగిన క్యారెట్ – చిన్న‌ది ఒక‌టి, చిన్న‌గా త‌రిగిన ఫ్రెంచ్ బీన్స్ – 3, ఉడికించిన బంగాళాదుంప – 1, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Veg Puff recipe in telugu make them in bakery style
Veg Puff

వెజ్ ప‌ఫ్ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. త‌రువాత ప‌సుపు, కారం, ఉప్పు, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి, చాట్ మ‌సాలా వేసి క‌ల‌పాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత బీన్స్, క్యారెట్ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. నీరంతా పోయి ముక్క‌లు ఉడికిన త‌రువాత బంగాళాదుంప‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి. దీనిని అంతా క‌లిసేలా కలుపుకుని ఒక నిమిషం పాటు వేయించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో స్టాండ్ ను ఉంచి మూత పెట్టి ఫ్రీహీట్ చేసుకోవాలి. త‌రువాత ప‌ఫ్ పేస్ట్రీని తీసుకుని పొడి పిండి చ‌ల్లుకుంటూ అర ఇంచు మందంతో చ‌తుర‌స్రాకార ఆకారంలో వ‌త్తుకోవాలి. త‌రువాత ఈ పేస్ట్రీని నాలుగు ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

త‌రువాత ఒక్కో ముక్క‌ను తీసుకుంటూ మ‌ధ్య‌లో కూర‌ను ఉంచి అంచుల‌కు నీళ్లు లేదా పాల‌ను రాయాలి. త‌రువాత ఈ పేస్ట్రీని త్రిభుజాకారంలో లేదా బుక్ పోల్డింగ్ ఆకారంలో ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప‌ఫ్ ల‌ను కేక్ ట్రే లోకి లేదా ప్లేట్ లోకి తీసుకుని పైన బ్ర‌ష్ తో పాల‌ను రాయాలి. త‌రువాత ఈ ట్రేను ఫ్రీహీట్ చేసుకున్న గిన్నెలో ఉంచి ఆవిరి బ‌య‌ట‌కు పోకుండా మూత పెట్టాలి. త‌రువాత వీటిని 45 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై బేక్ చేసుకోవాలి. త‌రువాత మ‌రో వైపుకు తిప్పి మూత పెట్టి మ‌రో 5 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ప‌ఫ్ ను క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు బేక్ చేసుకుని బ‌య‌ట‌కు తీసి స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ ప‌ఫ్ ల‌ను ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ విధంగా త‌యారు చేసిన వెజ్ ప‌ఫ్ ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts