Veg Sour Soup : మనకు రెస్టారెంట్ లల్లో లభించే పదార్థాల్లో వెజ్ సూప్ కూడా ఒకటి. వేడి వేడిగా తాగుతూ ఉండే ఈ వెజ్ సూప్ చాలా రుచిగా ఉంటుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ సూప్ ను తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. రెస్టారెంట్ లల్లో లభించే విధంగా కారంగా, ఘాటుగా ఉండే ఈ వెజ్ సూప్ ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వెజ్ సూప్ ను తయారు చేయడం చాలా సలుభం. కేవలం 10 నిమిషాల్లోనే రుచిగా రెస్టారెంట్ స్టైల్ వెజ్ సూప్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, నీళ్లు – 350 ఎమ్ ఎల్, క్యాబేజ్ తరుగు – పావు కప్పు, బీన్స్ తరుగు – 2 టేబుల్ స్పూన్స్, క్యారెట్ తరుగు – 2 టేబుల్ స్పూన్స్, పుట్ట గొడుగుల తరుగు – 2 టేబుల్ స్పూన్స్, బేబీకార్న్ తరుగు – 2 టేబుల్ స్పూన్స్, డార్క్ సోయాసాస్ – ఒక టేబుల్ స్పూన్, అరోమేటిక్ పౌడర్ – ఒక టీ స్పూన్, పంచదార – అర టీ స్పూన్, తెల్ల మిరియాల పొడి – అర టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, చైనీస్ చిల్లీ పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కార్న్ ఫ్లోర్ – 2 టీ స్పూన్స్, వెనిగర్ – ఒక టీ స్పూన్, స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు – 2 టేబుల్ స్పూన్స్.
వెజ్ సూప్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకోవాలి. తరువాత అందులో తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పచ్చిమిర్చి తరుగు వేసి అర నిమిషం పాటు వేయించాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు క్యాబేజ్, బీన్స్, క్యారెట్, పుట్ట గొడుగు, బేబీ కార్న్ తరుగు వేసి కలపాలి. తరువాత ఈ నీటిని బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు సోయా సాస్, అరోమేటిక్ పౌడర్, పంచదార, తెల్ల మిరియాల పొడి, మిరియాల పొడి, చిల్లీ పేస్ట్, ఉప్పు వేసి కలపాలి. దీనిని 5 నిమిషాల పాటు మరిగించిన తరువాత ముందుగా తయారు చేసుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి.
తరువాత వెనిగర్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ సూప్ తయారవుతుంది. దీనిని వేడి వేడిగా తాగితే చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ లకు వెళ్లే పని లేకుండా ఇలా ఇంట్లోనే వెజ్ సూప్ ను తయారు చేసుకుని తాగవచ్చు.