Tomato For Face Beauty : గాలిలో ఉండే దుమ్ము, ధూళి మన ముఖంపై పేరుకుపోవడం వల్ల ముఖం నల్లగా మారడం, మొటిమలు, చర్మంపై మృత కణాలు పేరుకుపోవడం, బ్లాక్ హెడ్స్, ఎండ వల్ల ముఖం నల్లగా మారడం వంటి వివిధ రకాల చర్మ సమస్యలతో బాధపడే వారు నేటి కాలంలో ఎక్కువవుతున్నారు. అలాగే మనం తీసుకునే ఆహారం, మారిన జీవన విధానం వంటి వాటి వల్ల కూడా ఈ చర్మ సమస్యలు తలెత్తుతాయి. ఇటువంటి చర్మ సమస్యల నుండి బయటపడడానికి మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. మార్కెట్ లో ఉండే ఫేస్ స్క్రబర్ లను, ఫేస్ ప్యాక్ లను వాడుతూ ఉంటారు. వాటి వల్ల ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలతో బాధపడే వారు మన ఇంట్లో ఉండే టమాటాను ఉపయోగించి చక్కటి అందాన్ని సొంతం చేసుకోవచ్చు. కేవలం ఒక్క టమాటాను ఉపయోగించి మన చర్మ సమస్యలన్నింటిని దూరం చేసుకోవచ్చు.
టమాటాతో ముఖాన్ని అందంగా, కాంతివంతంగా ఎలా మార్చుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక టమాటాను తీసుకోవాలి. తరువాత దానిని సగానికి కట్ చేయాలి. ఇప్పుడు సగం ముక్క టమాటను తీసుకుని దానికి పంచదారను అద్దాలి. ఇలా పంచదార అద్దిన టమాట ముక్కను తీసుకుని ముఖంపై రుద్దుకోవాలి. ఇలా పది నిమిషాల పాటు సున్నితంగా రుద్దుకుని తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తరువాత మిగిలిన టమాట ముక్కను పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత దానిలో రెండు టీ స్పూన్ల పాలను కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఆరిన తరువాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. టమాటను, పంచదారను కలిపి రాసుకోవడం వల్ల అది స్క్రబర్ లా పని చేస్తుంది. దీంతో ముఖం మీద పేరుకుపోయిన మృతకణాలు, దుమ్ము, ధూళి, మురికి తొలగిపోతుంది.
అలాగే పాలు, టమాట పేస్ట్ కలిపి రాసుకోవడం వల్ల చర్మానికి కావల్సిన పోషకాలు, తేమ అందుతాయి. అలాగే చర్మంలో ఉండే ఇన్ ప్లామేషన్ తగ్గి మొటిమలు తగ్గుతాయి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల మొటిముల, మచ్చలు, నలుపుదనం లేని అందమైన, కాంతివంతమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ చిట్కా తయారీలో ఉపయోగించిన ప్రతి పదార్థం కూడా మనకు సులభంగా లభించేదే. అలాగే ఇవి సహజ సిద్దమైనవే. కనుక ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. చాలా సులభంగా అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.