Madras Style Kurma : మనం అప్పుడప్పుడూ ఇంట్లో పరోటాలను తయారు చేస్తూ ఉంటాం. పరోటాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ పరోటాలను ఇష్టంగా తింటారు. ఈ పరోటాలను మనం కుర్మా కూరతో తింటే చాలా రుచిగా ఉంటుంది. కుర్మా కూర రుచిగా ఉంటేనే పరోటాలను మనం తినగలుగుతాము. ఈ కుర్మా కూరను మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కూరగాయలు వేసి చేసే ఈ కుర్మా కూరను మద్రాస్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మద్రాస్ స్టైల్ పరోటా కుర్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు, గసగసాలు – ఒక టేబుల్ స్పూన్, నూనె – అర కప్పు, బిర్యానీ ఆకు – 1, పత్తర్ ఫూల్ – 2, మటాఘీ మొగ్గ – 1, అనాస పువ్వు – 1, యాలకులు – 3, లవంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, తరిగిన పెద్ద టమాట – 1, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పచ్చి బఠాణీ – అర కప్పు, తరిగిన బంగాళాదుంప – 1, తరిగిన క్యారెట్ – 1, తరిగిన ఫ్రెంచ్ బీన్స్ – 4, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, గరం మసాలా – ఒక టీ స్పూన్, నీళ్లు – 400 ఎమ్ ఎల్, తరిగిన కొత్తిమీర – అర కట్ట.
మద్రాస్ స్టైల్ పరోటా కుర్మా తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పచ్చి కొబ్బరి తురుము, గసగసాలు వేసి వేయించాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కుక్కర్ లో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత బఠాణీ, క్యారెట్, బంగాళాదుంప, బీన్స్ వేసి వేయించాలి. వీటిని 3 నిమిషాల పాటు వేయించిన తరువాత కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి కలపాలి.
తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి పెద్ద మంటపై 2 విజిల్స్, చిన్న మంటపై ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పరోటా కుర్మా తయారవుతుంది. దీనిని పరోటాలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. పరోటాలతో ఈ కూరను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ కూరతో తింటే ఎన్ని పరోటాలు తిన్నామో కూడా తెలియకుండా తినేస్తారు.