Veg Tossed Salad : బరువు తగ్గాలని, అలాగే చక్కటి ఆరోగ్యమైన జీవనాన్ని సాగించాలని మనలో చాలా మంది సలాడ్ లను తింటూ ఉంటారు. సలాడ్ లను తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. మనం సులభంగా చేసుకోదగిన సలాడ్ వెరైటీలల్లో వెజ్ సలాడ్ కూడా ఒకటి. రెస్టారెంట్ లలో కూడా ఈ వెజ్ సలాడ్ మనకు లభిస్తూ ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు, గుండె ఆరోగ్యంగా పని చేయాలనుకునే వారు రోజులో ఒకపూట ఈ వెజ్ సలాడ్ ను తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. కేవలం 5 నిమిషాల్లోనే ఈ సలాడ్ ను మనం తయారు చేసుకోవచ్చు. రుచిగా ఉండడంతో పాటు మనకు చక్కటి ఆరోగ్యాన్ని, పోషకాలను అదించే ఈ వెజ్ సలాడ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ సలాడ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చెక్కు తీసి ముక్కలుగా తరిగిన కీరదోస – 2, చెక్కు తీసి సన్నగా తరిగిన క్యారెట్స్ – 2, గింజలు తీసి తరిగిన టమాటాలు – 2, గింజలు తీసి క్యూబ్స్ లాగా తరిగిన క్యాప్సికం – పెద్దది ఒకటి, క్యూబ్స్ లాగా తరిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – పావు టీ స్పూన్, నిమ్మరసం – ఒక టీ స్పూన్, నువ్వుల నూనె లేదా సలాడ్ ఆయిల్ – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
వెజ్ సలాడ్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో కీరదోస ముక్కలను వేసుకోవాలి. తరువాత మిగిలిన కూరగాయ ముక్కలన్నింటిని వేసుకోవాలి. తరువాత ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి, నూనె వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీరను చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ సలాడ్ తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.