Mushroom Pakoda : అనేక రకాల పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఆహారాల్లో పుట్టగొడుగులు కూడా ఒకటి. వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో పుట్టగొడుగులు మనకు ఎంతగానో సహాయపడతాయి. వీటితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. తరుచూ కూరలే కాకుండా ఈ పుట్టగొడుగులతో మనం ఎంతో రుచిగా ఉండే పకోడాలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పకోడాలు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. ఇంట్లో పుట్టగొడుగులు ఉంటే చాలు చిటికెలో ఈ పకోడాలను తయారు చేసుకుని తినవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ పుట్టగొడుగు పకోడాలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మష్రూమ్ పకోడా తయారీకి కావల్సిన పదార్థాలు..
పుట్టగొడుగులు – 200 గ్రా., అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, గరం మసాలా – పావు టీ స్పూన్, బియ్యంపిండి – 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, శనగపిండి – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
మష్రూమ్ పకోడా తయారీ విధానం..
ముందుగా పుట్టగొడుగులను శుభ్రంగా కడిగి నాలుగు లేదా ఆరు ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి కలపాలి. తరువాత ఇందులో కట్ చేసుకున్న పుట్టగొడుగు ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు బియ్యంపిండి, కార్న్ ఫ్లోర్, శనగపిండి వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ పిండి ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పుట్టగొడుగులను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై కదుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత పిండి కలుపుకున్న గిన్నెలోనే జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కలపాలి. తరువాత వీటిని నూనెలో వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే మష్రూమ్ పకోడాలు తయారవుతాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన పకోడాలను ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు.