Vegetables Curry : సాధారణంగా మనం రోజూ వివిధ రకాల కూరగాయలను, ఆకుకూరలను వండుకుని తింటుంటాం. అయితే కొన్ని సార్లు కూరకు సరిపడా కూరగాయలు ఉండవు. దీంతో ఏం కూర చేయాలో తోచదు. కానీ అన్ని కూరగాయలను కలిపి కూడా కూర చేసుకోవచ్చు. దీన్నే మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ అని అంటారు. ఏం కూరగాయలు ఉన్నా సరే వాటిని కలిపి కూరలా వండితే ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బీన్స్, క్యారెట్, వంకాయ, సొరకాయ, పచ్చి మిర్చి, క్యాప్సికమ్, టమాటా ముక్కలు – 1 కప్పు చొప్పున, కొబ్బరికాయ – 1, కొత్తిమీర తురుము – 2 టేబుల్ స్పూన్లు, నూనె – 1 టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, ఎండు మిర్చి – 2, మెంతులు – పావు టీస్పూన్, ధనియాల పొడి – అర టీస్పూన్, ఉప్పు – తగినంత, కారం – 1 టీస్పూన్, పచ్చి మిర్చి – 4.
మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీని తయారు చేసే విధానం..
కొబ్బరికాయను తురిమి మెత్తగా రుబ్బి పాలు తీయాలి. ఇలా రెండు మూడు సార్లు తీసి పిప్పి పారేయాలి. కూరగాయలన్నీ ఇంచు సైజు చొప్పున ముక్కలుగా కట్ చేయాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి వేసి వేయించాలి. తరువాత టమాటా తప్ప మిగిలిన కూరగాయ ముక్కలన్నీ వేసి 2 నిమిషాల పాటు వేయించి మూత పెట్టాలి. అవి కాస్త మగ్గిన తరువాత టమాటా ముక్కలు వేసి ఒక నిమిషం వేగాక కాసిన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. ముక్కలు పూర్తిగా ఉడికాయ అనుకున్నాక ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. ఇప్పుడు కొబ్బరిపాలు పోసి సిమ్‌లో ఉడికించి దించే ముందు కొత్తిమీర తురుము వేసి దించాలి. దీంతో ఎంతో రుచికరమైన మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ రెడీ అవుతుంది. దీన్ని అన్నం లేదా చపాతీలు.. వేటితో తిన్నా సరే ఎంతో రుచిగా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది.