Village Style Chicken Curry : చికెన్ ను మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ తో చేసే వంటకాలను తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. చికెన్ తో ఎక్కువగా మనం కూరను వండుతూ ఉంటాం. చికెన్ కూరను ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తూ ఉంటాం. ఈ చికెన్ కర్రీని రుచిగా, తేలికగా, విలేజ్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – అరకిలో, తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 4, పెరుగు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన టమాటాలు – 2, అల్లం – 2 ఇంచుల ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 10, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, గసగసాలు – అర టేబుల్ స్పూన్, యాలకులు – 2, లవంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, పచ్చి కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, చికెన్ మసాలా- ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కరివేపాకు – ఒక రెమ్మ, కొత్తిమీర – కొద్దిగా.
విలేజ్ స్టైల్ చికెన్ తయారీ విధానం..
ముందుగా చికెన్ లో అర టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, పెరుగు, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక టీ స్పూన్ నూనె వేసి బాగా కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. ఇప్పుడు రోట్లో అల్లం, వెల్లుల్లి, కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత ధనియాలు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి మెత్తగా దంచుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా దంచుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి.
తరువాత ముందుగా సిద్దం చేసుకున్న చికెన్ వేసి కలపాలి. దీనిని పది నిమిషాల పాటు ఉడికించిన తరువాత ముందుగా దంచుకున్న మసాలా, చికెన్ మసాలా, ఉప్పు, కారం వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి చికెన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటి, సంగటి వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే చికెన్ కంటే ఈ విధంగా చేసిన చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.