Coconut Water For Pregnants : గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారంపైనే శిశువు ఎదుగుదల, మెదడు అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. గర్భంతో ఉన్నప్పుడు పోషకాలు కలిగిన ఆహారాన్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. వైద్యులు కూడా పోషకాలు కలిగిన సహజ సిద్ద ఆహారాలనే ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. అయితే చాలా మంది గర్భిణీ స్త్రీలు వారు తీసుకునే ఆహారంపై అనేక అపోహలు కలిగి ఉంటారు. వారికి ఇది తినకూడదు.. అది తినకూడదు… అని చెబుతూ ఉంటారు. అలాగే చాలా మంది గర్భిణీ స్త్రీలు కలిగే ఉండే వివిధ రకాల అపోహల్లో కొబ్బరి నీళ్లు తాగకూడదు అనేది కూడా ఒకటి. గర్భిణీ స్త్రీలు కొబ్బరి నీళ్లు తాగకూడదని చాలా మంది చెబుతూ ఉంటారు.
గర్భంతో ఉన్నప్పుడు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గర్భస్థ శిశువు తల పెద్దగా ఉంటుంది. అలాగే శిశువుకు వెంట్రుకలు ఉండవు. కొబ్బరి నీళ్లు తాగితే శిశువుకు జలుబు చేసినట్టుగా ఉంటుందని చాలా మంది చెబుతూ ఉంటారు. అసలు నిజంగా గర్భిణీ స్త్రీలు కొబ్బరి నీళ్లు తాగకూడదా.. తాగితే ఏమవుతుంది.. అసలు వైద్యులు ఏమంటున్నారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి నీళ్లు మనకు సహజ సిద్దంగా లభిస్తాయి. వీటిలో ఎటువంటి రసాయనాలు ఉండవు. అలాగే ఈ నీటిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటిలో సోడియం, పొటాషియం, విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్, కాపర్, క్యాల్షియం, రైబోప్లేవిన్, ఘైమిన్, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శిశువు మెదడు అభివృద్దిలో ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే గర్భిణీ స్త్రీలు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల వారిలో రక్తపోటు అదుపులో ఉంటుంది.
రక్తపోటు పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే గర్భిణీ స్త్రీలల్లో కాళ్లు లాగడం, పిక్కలు పట్టేయడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలతో బాధపడే గర్భిణీ స్త్రీలు కొబ్బరి నీళ్లను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికి కొబ్బరి నీళ్లను అతిగా కూడా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగని వాటిని ఎప్పుడో ఒకసారి తీసుకున్నా కూడా ఫలితం ఉండదని వారు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు రోజుకొక కొబ్బరి బోండాను తాగవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే ఈ కొబ్బరి నీళ్లను ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకుంటే మంచిదని వారు చెబుతున్నారు. అలాగే కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
జీవక్రియల రేటు పెరుగుతుంది. వేసవికాలంలో వీటిని తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది. అలాగే గర్బిణీ స్త్రీలు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల వారిలో ఉమ్మనీరు తగినంతగా ఉంటుంది. అలాగే మూత్రాశయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ లు రాకుండా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు కొబ్బరి నీళ్లను తాగవచ్చని వీటిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువు ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వీటిపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.