Wheat Rava Sweet : మనం గోధుమ రవ్వను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. గోధుమ రవ్వ కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనితో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ రవ్వతో ఉప్మాతో పాటు వివిధ రకాల తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. గోధుమ రవ్వతో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అందులో భాగంగా ఈ గోధుమ రవ్వతో నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉండే స్వీట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమ రవ్వ స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
సన్నటి గోధుమ రవ్వ – ఒక కప్పు, బెల్లం తురుము – ఒక కప్పు, నీళ్లు – రెండు కప్పులు, నెయ్యి – పావు కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, జీడిపప్పు – కొద్దిగా, బాదం పప్పు – కొద్దిగా.
గోధుమ రవ్వ స్వీట్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీళ్లు, బెల్లం వేసి బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వడకట్టుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక గోధుమ రవ్వను వేసి చిన్న మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న బెల్లం నీటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలపాలి. బెల్లం నీటిలో గోధుమ రవ్వను దగ్గర పడే వరకు కలపాలి. తరువాత డ్రై ఫ్రూట్స్, ఉప్పు, యాలకుల పొడి వేసి కలపాలి. దీనిని కళాయికి అంటుకోకుండా అయ్యే వరకు కలుపుతూ ఉడికించాలి. ఇలా ఉడికిన తరువాత ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని పైన అంతా సమానంగా చేసుకోవాలి.
తరువాత దానిపై మరికొద్దిగా డ్రై ఫ్రూట్స్ ను చల్లుకుని కొద్దిగా లోపలికి వెళ్లేలా వత్తుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారే వరకు ఉంచాలి. చల్లారిన తరువాత పది నిమిషాల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. తరువాత బయటకు తీసి కావల్సిన ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ రవ్వ స్వీట్ తయారవుతుంది. దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు, పండుగలకు ఇలా గోధుమ రవ్వతో స్వీట్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఈ స్వీట్ ను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.