Vitamin E : వృద్ధాప్య ఛాయలు మన దరి చేరకుండా చేయడంలో, చర్మం మరియు జుట్టు నిగనిగలాడుతూ కాంతివంతంగా ఉండేలా చేయడంలో మనకు విటమిన్ ఇ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిసిందే. వైద్యులు కూడా యవ్వనంగా , అందంగా కనబడాలంటే విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. ఈ విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను కూడా చాలా మంది తీసుకుంటారు. కేవలం యవ్వనంగా కనబడడమే కాకుండా విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాలను లేదా క్యాప్సుల్స్ ను తీసుకోవడం వల్ల మనం ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. విటమిన్ ఇ వల్ల మన శరీరానికి కలిగే ఇతర ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ ల కూడా పని చేస్తుంది.
శరీరంలో కణజాలం నశించకుండా చేయడంలో అలాగే కణాలు క్యాన్సర్ కణాలుగా మారకుండా చేయడంలో విటమిన్ ఇ మనకు దోహదపడుతుంది. అలాగే శరీరంలో కణాలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. కణాలు దెబ్బతిన్నా, బలహీన పడినా మనం అనారోగ్యాల బారిన పడతాము. మన శరీరంలో కణాలు బలహీనపడకుండా ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో, కొత్త కణాలు ఏర్పడేలా చేయడంలో విటమిన్ మనకు దోహదపడుతుంది. అదే విధంగా మనం తిన్న ఆహారం శక్తిలా మారాలంటే మన శరీరానికి విటమిన్ ఇ ఎంతో అవసరం. కొందరిలో ఎంత ఆహారం తీసుకున్నప్పటికి తగినంత శక్తి లభించక నీరసపడిపోతుంటారు. శరీరంలో విటమిన్ ఇ తగినంత లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. కనుక శరీరంలో తగినంత విటమిన్ ఇ ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా మన శరీరంలో ఉండే రక్షక కణాలు శరీరంలో వివిధ భాగాల్లో చేరిన వైరస్, బ్యాక్టీరియాలను నశింపజేస్తూ ఉంటాయి.
ఈ రక్షక కణాలు రక్తం ద్వారా వైరస్ లు ఉన్న శరీర భాగానికి చేరుకుంటాయి. ఇలా వైరస్ చేరిన భాగాలకు రక్తప్రసరణను పెంచి రక్తం ద్వారా రక్షక కణాలను త్వరగా చేరవేయడంలో విటమిన్ ఇ దోహదపడుతుంది. అలాగే పురుషులకు వృషణాల్లో వీర్య కణాలను ఉత్పత్తి చేసే లేడిగ్ కణాలు ఉంటాయి. ఈ కణాలను రక్షించి వీర్య కణాల ఉత్పత్తిని పెంచడంలో విటమిన్ ఇ సహాయపడుతుంది. విటమిన్ ఇ తగినంత లేకపోతే పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తి సరిగ్గా జరగదు. అదే విధంగా మన శరీరంలో ప్రతి కణం మరో కణంతో అవినాభావ సంబంధం కలిగి ఉండాలి. ఇలా ఒక కణం మరో కణంతో చక్కటి బంధం కలిగి ఉండేలా చేయడంలో విటమిన్ ఇ అవసరమవుతుంది. అదే విధంగా రక్తంలో ప్రవహించే ప్లేట్ లెట్స్ రక్తనాళాల గోడలకు అంటుకోకుండా రక్తంలో ప్రవహించేలా రక్షించకుండా ఉండడానికి విటమిన్ ఇ అవసరమవుతుంది.
శరీరంలో విటమిన్ ఇ లోపిస్తే ప్లేట్ లెట్స్ రక్తనాళాల్లో గోడల్లో పేరుకుపోతాయి. దీంతో రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే కంటిలో ఉండే మ్యాక్యులాను రక్షించడంలో, దానిలో ఇన్ ప్లామేషన్ రాకుండా చేయడంలో కూడా ఈ విటమిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో కంటి చూపు చక్కగా ఉంటుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే విటమిన్ ఇ మన శరీరానికి రోజుకు 15 మిల్లీ గ్రాముల మోతాదులో అవసరమవుతుంది. అలాగే ప్రొద్దు తిరుగుడు గింజల్లో, బాదం పప్పులో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఈ పప్పులను నానబెట్టి తీసుకోవడం వల్ల మన శరీరానికి తగినంత విటమిన్ ఇ లభిస్తుంది. విటమిన్ ఇ తగినంత లభించడం వల్ల మనం అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాము.