ఆధ్యాత్మికం

Dhwaja Sthambham : గుడిలో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందో తెలుసా..? ధ్వజస్తంభం వెనకున్న కథ ఇదే..!

Dhwaja Sthambham : మనలో చాలా మందిమి గుడికి వెళ్తుంటాం. మన కోరికలు తీర్చమని దేవున్ని వేడుకుంటాం. గుళ్లోకి వెళ్లేముందు మనకు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. మనం ధ్వజస్తంభానికి మొక్కిన తర్వాతనే గుడిలో దేవుడి దగ్గరకెళ్తాం. కానీ గుడిలో ధ్వజస్తంభం ఎందుకుంటుంది అని ఆలోచించారా. గుడిలో ఉండే ధ్వజస్తంభం వెనుక ఒక కథ ఉంది. కురుక్షేత్రం తర్వాత ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టించి రాజ్యాన్ని పాలిస్తుంటాడు. ప్రజల దగ్గర మెప్పుకోసం ధర్మమూర్తిగా పేరుపొందడం కోసం అనేక దాన ధర్మాలు చేస్తుంటాడు. అది సరికాదని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి గుణపాఠం చెప్పాలనుకుంటాడు. అందుకని అశ్వమేధ యాగం చేసి శత‌ృరాజులను గెలిచి దేవతలను, బ్రాహ్మణులను గెలిచి రాజ్యాన్ని సుభిక్షం చేయమని కోరతాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.

ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్ని బంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ముళ్లందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుద్ధంలో జయించడం సాధ్యంకాదనీ, కపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు. శ్రీకృష్ణుడు, ధర్మరాజు కలసి ముసలి బ్రాహ్మణుల రూపంలో మణిపురం వెళ్తారు. వారిని చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు.

దానికి శ్రీకృష్ణుడు.. రాజా.. మీ దర్శనార్ధమై మేమువస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసినదిగా మేము ప్రార్థించగా, సింహం మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైన‌ మయూరధ్వజుని శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యా పుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే ఇతడ్ని వదిలేస్తానని చెప్పిందనీ, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యా కొడుకులకు అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోతాడు.

why Dhwaja Sthambham in temples what is the story

ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధతో నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది.. అని వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి మయూరధ్వజా, నీ దానగుణం అమోఘం.. ఏదైనావరం కోరుకో.. అంటాడు. పరమాత్మా.. నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగా అనుగ్రహించండి.. అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు తథాస్తు అని అంటాడు.

మయూరధ్వజా.. నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన తర్వతనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది.. అంటూ చెబుతాడు. అప్పటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాతే మూలవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది. ఇదీ.. ధ్వ‌జ‌స్తంభం వెనకున్న అస‌లు క‌థ‌.

Admin

Recent Posts